న్యూ ఢిల్లీ :
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ సాయంత్రం (నవంబర్ 10) దాదాపు 7 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్క్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నెమ్మదిగా కదులుతున్న ఓ కారులో పేలుడు సంభవించింది. దీంతో కొంతమంది పాదాచారులు గాయపడ్డారు. కొన్ని వాహనాలకు మంటలు వ్యాపించి దెబ్బతిన్నాయి. ప్రాధమిక నివేదిక ప్రకారం కొందరి ప్రాణాలు పోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి సమచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్జీ, ఎన్ఐఏ బృందాలు.. ఫోరెన్సిక్(FSL) బృందంతో కలిసి సమగ్ర దర్యాప్తు చేపట్టాయి. ఘటన స్థలానికి సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశిలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశాం. ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తాం’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివరించారు.
పేలుళ్లలో గాయపడిన వారు చికిత్స పొందుతున్న ఎల్ఎన్జీపీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను అమిత్ షా పరామర్శించారు. వారి ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నా. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశించారు.
