న్యూఢిల్లీ : పార్లమెంట్(Parliament)లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)పై చర్చించాలన్న(debate) విపక్షాల డిమాండ్ కు ఎట్టకేలకు కేంద్రం(Central government) అంగీకరించింది(agreed). లోక్‌సభలో 9, 10 తేదీల్లో ‘సర్’ పై చర్చించాలని నిర్ణయించింది. డిసెంబర్ 8న వందేమాతరంపై చర్చ జరగనుంది.
‘సర్’పై చర్చకు ప్రతిపక్షాలు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఉభయ సభల్లో ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం ముందుగా వందేమాతరం పై చర్చకు ప్రభుత్వం పూనుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సర్ పై చర్చకు పట్టుబట్టాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. లోక్‌సభలో గందరగోళంతో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. చేసేది లేక స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చ కోరుతూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సభ్యుల డిమాండ్ కు ఒప్పుకోకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభలో కొన్ని అంశాలపై విపక్షాలు లేకుండానే చర్చించారు. తర్వాత రాజ్యసభను కూడా రేపటికి వాయిదా వేశారు.
రేపటి నుంచి కూడా ఉభయసభలు సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో స్పీకర్ ఓంబిర్లా విపక్ష పార్టీల ప్రతినిధులతో పార్లమెంట్ హౌస్‌లోని స్పీకర్ చాంబర్‌లో చర్చించారు. చివరకు కేంద్ర ప్రభుత్వం సర్ పై చర్చకు అంగీకరించడంతో రేపటి సమావేశాలపై ఆసక్తి నెలకొంది.
