రక్తదానం ఇప్పుడు అన్ని దానాల కంటే గొప్పదానంగా నిలుస్తోంది. రక్తం దానం చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టడం కంటే గొప్ప పుణ్యకార్యం ఏముంటుంది? మనుషులు రక్తదానం చేయడం ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా పెరిగింది. చాలామంది వివిధ బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేస్తూ, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తూఉన్నారు. అదే పని ఓ కుక్క చేసింది. అవును, ఓ కుక్క రక్తదానం చేసి సాటి కుక్క ప్రాణాలు కాపాడింది.
కర్ణాటక(Karnataka)లోని కొప్పల్(Koppal)లో ఓ అధికారి తొమ్మిదేళ్ల లాబ్రడార్(Labrador) పెంపుడు కుక్కకు జబ్బు చేసింది. దాని హిమోగ్లోబిన్(Haemoglobin) ప్రాణాపాయ స్థాయికి పడిపోయింది. వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆ శునకం ప్రాణాలతో ఉండదు. ఆ స్థానిక పశువైద్యశాల(Veternary Doctor) వైద్యుడు డా. చంద్రశేఖర్(Dr. Chadrasekar) వెంటనే తమ దగ్గరున్న కుక్కల డాటాబేస్(Dog Blood Database)లో, ఈ లాబ్రడార్ రక్తానికి సరిపోయే రక్తమున్న వాటికోసం వెతకగా, మూడు శునకాలు దొరికాయి. ఆ మూడింటి యజమానులను సంప్రదించి, వాటి రక్త నమూనాలను పరీక్షించగా, మూడు సంవత్సరాల వయసున్న భైరవ(Bhairava) అనే డాబర్మన్(Dobermann) రక్తం సరిగ్గా సరిపోయింది.
డా. బసవరాజ పుజార్(Dr. Basavaraj Pujar), ఓ లెక్చరర్‌కు చెందినదీ భైరవ. ఆయనను సంప్రదించిన డా.చంద్రశేఖర్ పరిస్థితి వివరించి, రక్తదానానికి అభ్యర్థించగా, డా.పుజార్ వెంటనే ఒప్పుకున్నారు. వెంటనే అందుకు ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. బసవరాజ పుజార్ తన భైరవను హాస్పిటల్‌కు తీసుకురాగా, నిర్ణీత సమయంలో భైరవ నుండి 350 మి.లీ(350 ml Collected)ల రక్తం సేకరించి, భైరవను ఇంటికి పంపారు. అనంతరం ఆ రక్తాన్ని లాబ్రడార్‌కు విజయవంతంగా ఎక్కించి(Transfused), దాని ప్రాణాలు నిలబెట్టారు. ఇప్పుడు ఆ లాబ్రడార్ హ్యాపీగా ఆసుపత్రి నుండి డిస్చార్జ్ అయి ఆరోగ్యంగా(Stable health) ఇంటికి వెళ్లింది.
అన్నట్లు, ఒకరోజు ఈ లాబ్రడార్, తనకు రక్తదానం చేసిన భైరవను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేసిందట. లాబ్రడార్ యజమాని ఒకరోజు దాన్ని తీసుకుని బసవరాజ పుజార్ ఇంటికి వెళ్లి ధన్యవాదాలు చేసి, రెండు కుక్కలను పక్కపక్కన కూర్చోబెడితే, ఆశ్చర్యకరంగా అవి కొట్లాడుకోకపోగా, లాబ్రడార్, భైరవను ఆప్యాయంగా నాకుతూ, చెలిమి ప్రదర్శించిదని ఆయన తెలిపారు.
గమ్మత్తుగా ఉంది కదూ… ఆనందంగా కూడా అనిపించింది కదా…