ED Raids| లగ్జరీ కార్ల కేసులో సినీతారల ఇళ్లపై ఈడీ సోదాలు

లగ్జరీ కార్ల కొనుగోలు స్కామ్ కేసులో ఈడీ సినీ తారల ఇళ్లపై సోదాలు చేపట్టింది, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ ఇళ్లపైన, కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్‌షాపులపైన సోదాలు సాగుతున్నాయి.

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల (luxury cars) కొనుగోలు స్కామ్ కేసులో ఈడీ (ED raids) సినీ తారల(Actors) ఇళ్లపై సోదాలు చేపట్టింది. . కేరళ, చెన్నైల్లోని మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. విలాసవంతమైన కార్ల స్మగ్లింగ్‌ కేసులో భాగంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టికి సంబంధించిన చెన్నైలోని ఆఫీసుపైన, దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమిత్‌ చకల్‌కల్‌ ఇళ్లపైన, కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్‌షాపులపైన సోదాలు సాగుతున్నాయి. ఎనిమిది మంది ఈడీ అధికారులు, సిబ్బంది సోదాలు చేస్తున్నారు.

కోయంబత్తూరులో ఉన్న ఒక నెట్‌వర్క్ భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్లతో నకిలీ పత్రాలు తయారు చేసి, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో తప్పుడు ఆర్టీవో రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఈడీకి లభించిన ప్రాథమిక సమాచారంగా ఈడీ తెలిపింది. “ఆ వాహనాలను తరువాత ధనవంతులైన వ్యక్తులకు, అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారు, తక్కువ ధరలకు విక్రయించారు,” అని అధికారులు తెలిపారు. విదేశీ మారక నిర్వహణ చట్టంలోని సెక్షన్ 3, 4, మరియు 8 ఉల్లంఘనల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఇవి అనధికార విదేశీ మారక లావాదేవీలని, హవాలా మార్గాల ద్వారా సరిహద్దు చెల్లింపులతో సంబంధం కలిగి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. డబ్బు లావాదేవీలను, లాభదారుల నెట్‌వర్క్‌ను, విదేశీ మారక ప్రవాహాన్ని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.

ఇక ఇటీవల దుల్కర్‌ సల్మాన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నివాసాల్లో కస్టమ్స్ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసుపై కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేశారు. ‘ఆపరేషన్‌ నమకూర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా పలువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులోభాగంగా కోచి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇళ్లతో పాటు, పనంపిల్లి నగర్‌లలో సోదాలు జరిపారు.