విధాత, హైదరాబాద్:
ముఖ్మమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ అన్నారు. ఫస్ట్రేషనల్ ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కే.లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ మోసాల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పార్టీపై నిందలు వేస్తారా? అని ప్రశ్నించారు. బీహార్ లో ఇంటికో ఉద్యోగం అనే హామి ఇచ్చారని, ఏడు కోట్ల మంది ఉన్న ఆ రాష్ట్రంలో అది సాధ్యమవుతుందా అని లక్ష్మణ్ నిలదీశారు.
అయితే, సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజలకు ఏ గిఫ్ట్ ఇస్తారో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెట్టాపట్టాలు వేసి అధికారాన్ని పంచుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. అంతేకాక, 20 శాతం ఓట్ల కోసం ఇంకా దిగజారి మాట్లాడితే, 80 శాతం ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. పాముకు పాలు పోసి పెంచినట్టు, పాతబస్తీలో ఎంఐఎంకు అవకాశం ఇస్తే పరిస్థితి విష నాగుల మాదిరే అవుతుంది అని ఎంపీ లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
