Rain Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచనలు

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడనున్న రెండు అల్పపీడనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

విధాత, అమరావతి :

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది వేగంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కాగా, మొంథా తుఫాన్ సృష్టించిన నష్టం నుంచి తేరుకోకముందే మళ్లీ వాతావరణ శాఖ అధికారులు వర్ష సూచనలు జారీ చేశారు. 

వర్షాలతో పాటు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలల తీవ్రత కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టమైన సూచనలు జారీ చేసింది. అలాగే, ఈ నెల 17వ తేదీ నుంచి డిసెంబర్ 7 వరకు అల్పపీడంనం ప్రభావంతో చెన్నైలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ పై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా, రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో వర్ష సూచనలతో ప్రజల్లో ఆందోళన నెల కొన్నది.