విధాత :
కొడుకు పుట్టడం లేదని ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది.. అంతే కాదు ఆ ఇల్లాలు ఒంటరిగా కాకుండా తన 11 నెలల కూతురితో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండంలోని రేండ్ల గూడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేండ్లగూడకు చెందిన షట్పల్లి శ్రావణ్ కుమార్ కు జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన స్పందన (24)తో 2020లో వివాహం జరిగింది. దంపతులకు పండంటి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద పాప మోక్షశ్రీ (3), చిన్న కూతురు వేదశ్రీ (11 నెలలు) ఉన్నారు.
అయితే వేదశ్రీ పుట్టిన తరువాత ఇద్దరూ ఆడపిల్లలేనన్న ఆలోచనతో స్పందన కుంగిపోయింది. తరచూ మగబిడ్డ పుట్టలేదని ఆవేదన వ్యక్తం చేసేది. జీవితంపై విరక్తి పుడుతోందని, ఆత్మహత్య చేసుకుంటానని భర్తకు పలుమార్లు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. భర్త శ్రావణ్ గుడిపే 13 బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ బిజీగా ఉండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్పందన చిన్న కూతురు వేదశ్రీకి అన్నం తినిపిస్తానంటూ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లింది. కొంతసేపటికి ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో గమనించిన అత్తామామలు వెనకాల ఉన్న వ్యవసాయ బావి వైపు వెళ్లి చూశారు. స్పందన శవం తేలియాడుతూ కనిపించింది. గ్రామస్తుల సహాయంతో బావి నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, చిన్నారి వేదశ్రీ మృతదేహం కూడా అదే బావిలో తేలియాడింది. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్పందన తల్లి బూదారపు ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
