విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో (Jubilee Hills By Election) కాంగ్రెస్(Congress) టికెట్ కోసం ఎమ్మెల్సీ మహ్మద్ అజారుద్దీన్(Azharuddin) మళ్లీ ప్రయత్నాలు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహ్మద్ అజారుద్దిన్ ఉప ఎన్నికలో పోటీ కోసం మరోసారి పార్టీ టికెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేశారు. అయితే అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ అధిష్టానం అజారుద్ధీన్ ను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది. దీంతో అజారుద్ధీన్ పేరు టికెట్ రేసులో నుంచి తప్పుకున్నట్లేనని అంతా భావించారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్న అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ సొంతం చేసుకోవడానికి మరోసారి తన ప్రయత్నాలు చేపట్టారు. ఇందుకోసం తాజాగా పార్టీ మైనార్టీ నేతలతో అజారుద్ధీన్ భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ టికెట్ వదలొద్దని అజార్ కు మైనార్టీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం.
టికెట్ కోసం ఆశావహులు మధ్య గట్టి పోటీ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు మెజార్టీగా ఉండటం..ఉప ఎన్నికల్లో గెలిస్తే అటు మైనార్టీ కోటాలో..ఇటు హైదరాబాద్ నుంచి మంత్రి పదవి కోటాలో రెండింటి పరంగా మంత్రి పదవి దక్కవచ్చన్న నమ్మకం అజారుద్ధీన్ ను పోటీకి ముందుకు నడిపిస్తుంది. మరోవైపు.. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తుది కరసత్తు చేస్తుంది. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్. రెడ్డి పేర్లతో ఓ షార్ట్ లిస్టు తయారు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇతర ఆశావహుల నుంచి గట్టిగా అసమ్మతి వినిపిస్తుండటం..ఇటు అజారుద్దీన్ మరోసారి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ గా తయారైంది.