న్యూఢిల్లీ: తన ఇంట్లో భారీ మొత్తంలో అక్రమ నగదు బయటపడిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మ(Justice Yashwant Verma)కు సుప్రీంకోర్టు(Supreme Court )లో ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. ఈ ఘటనలో భారీ మొత్తంలో కాలిన నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. అనంతరం మార్చి 28న సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ యశ్వంత్‌వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసి.. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలు అప్పగించొద్దని సూచించింది. నోట్ల కట్టల ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన అంతర్గత దర్యాప్తు నివేదికను సవాలు చేస్తూ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది( Petition dismissed).
నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ పక్షాన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ముకుల్ రోహత్గి హాజరయ్యారు. జస్టిస్ వర్మ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, ఏజీ మాషితో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. జస్టిస్ వర్మ పిటిషన్‌ను సమర్థించలేమని తేల్చిచెప్పింది. ఆయన అంతర్గత కమిటీ విచారణలో పాల్గొన్న తీరు, ఆ తర్వాత అసలు కమిటీ సామర్థ్యాన్ని ప్రశ్నించడాన్ని తాము పరిగణనలోకి తీసుకొన్నట్లు పేర్కొంది. ఆయన రిట్ పిటిషనే విచారణకు అనర్హమని తేల్చింది.
అప్పటి సీజేఐఏర్పాటుచేసిన అంతర్గత కమిటీ ఒక్క ఫొటోలు, వీడియోల అప్‌లోడ్ విషయంలో తప్పించి.. మిగిలిన అంశాల్లో చట్టాన్ని పూర్తిగా అనుసరించారని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఫొటోలు, వీడియోల అంశంలపై జస్టిస్ వర్మ తన పిటిషన్ అభ్యంతరం చెప్పకపోవడంతో.. దానిని కూడా పట్టించుకోమని ధర్మాసనం పేర్కొంది. అటు జస్టిస్ వర్మపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ న్యాయవాది మాథ్యూ దాఖలు చేసిన ఓ రిట్ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
అభిశంసనకు మార్గం సుగమం
తాజాగా వర్మ పిటిషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన నిర్ణయంతో పార్లమెంట్‌లో ఆయనపై అభిశంసన చేపట్టేందుకు మార్గం సుగమమైంది. జస్టిస్ వర్మను విధుల నుంచి తొలగించాలని నాటి సీజీఐ సంజీవ్‌ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్స్ చేసిన విషయం తెలిసిందే. యశ్వంత్ వర్మ నివాసంలో భారీ మొత్తంలో అక్రమ నగదు బయటపడటంతో ఆయన్ను తొలగించాలని త్రిసభ్య కమిటీ నివేదిక సిఫార్సు చేసింది.