Jubilee Hills | జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయమైంది.. కానీ మెజార్టీ ఎంత అన్నదే తేలాలి : కేటీఆర్

బుల్డోజర్‌ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ, తెలంగాణలో అదే బుల్డోజర్‌ రాజ్యం నడుస్తుంటే రాహుల్‌ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అని ప్రశ్నించారు. రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యే పార్టీ మారారన్నారు.

KTR

విధాత :
పెద్ద పెద్ద లీడర్లను తీసుకొచ్చి తెలంగాణ కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ ప్రకటించింది.. మార్పు తెస్తాం అంటూ ప్రచారం చేసింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మైనార్టీలను కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌కుగా చూస్తోందని ఆరోపించారు. సోమవారం శంషాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ మైనార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల క్రితం మైనార్టీల కోసం 4వేల కోట్ల బడ్జెట్‌ పెడతామన్నారు.. పెట్టారా? లేదు. మైనార్టీ సబ్‌ ప్లాన్‌ కూడా తెస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పింది. రెండేళ్లు అయిపోయాయి.. ఇంకో మూడేళ్లలో కూడా వీళ్లు చేసేది ఏమీ ఉండదు’ అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన షాదీ ముబారక్‌ కింద లక్ష రూపాయలు ఇస్తే.. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు.

కేసీఆర్ ప్రారంభించిన మైనార్టీ స్కూళ్ల వల్ల ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అవుతున్నారని కేటీఆర్ చెప్పారు. నాలుగు ఉన్న మెడికల్‌ కాలేజీలు కేసీఆర్‌ 34కు పెంచారన్నారు. పదేళ్లలో ఎన్నో పనులు చేసినప్పటికీ మేం కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చేసి ఉంటే చేసుండొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ.. ఇండియాలో మైనార్టీలకు కేసీఆర్‌ చేసినన్ని పనులు ఇంకెవరూ చేయలేదని తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం అత్యధికంగా కేసీఆర్ ఖర్చు చేశారన్నారు. ‘ ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాల్లో అసదుద్దీన్‌ ఒవైసీ కూడా చెప్పారు.. కానీ ఇక్కడ చెప్పరు’ అని కేటీఆర్ అన్నారు.

బుల్డోజర్‌ రాజ్యం నడవదని యూపీపై రాహుల్ గాంధీ విమర్శించారు. కానీ, తెలంగాణలో అదే బుల్డోజర్‌ రాజ్యం నడుస్తుంటే రాహుల్‌ గాంధీ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అని ప్రశ్నించారు. రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌తో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యే పార్టీ మారారన్నారు. సీఎం అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదని ఎద్దేవా చేశారు. మోదీ స్కూల్లో చదివాను.. చంద్రబాబు కాలేజీకి వెళ్లాను.. రాహుల్‌ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్‌ బహిరంగంగానే చెబుతున్నారన్నారు. మోదీని చౌకీదార్‌ చోర్‌ అని రాహుల్ అంటే.. రేవంత్‌ రెడ్డి కాదు కాదు.. ఆయన నా పెద్దన్న అని చెబుతారని కేటీఆర్ విమర్శించారు.

సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు మోదీ జేబు సంస్థలు అని విమర్శిస్తే..రేవంత్‌ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తారన్నారు. ఒక సంవత్సరం క్రితం పొంగులేటి ఇంటిపై ఈడీకి రైడ్స్‌ అయినా అంతా సైలెంట్‌ గా ఉందన్నారు. రేవంత్‌ రెడ్డి బంధువుకు కేంద్రంలో కాంట్రాక్టులు వస్తే.. బదులుగా రేవంత్‌ రెడ్డి కూడా బీజేపీ నేతకు లాభం చేకూరుస్తారని కేటీఆర్ ఆరోపించారు. మోదీ తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే తొందరగా రేవంత్ తెలంగాణలో అమలు చేస్తారని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్‌-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్‌ను కూడా ఎన్నుకోలేదని విమర్శించారు. క్రికెట్‌లో అజారుద్దీన్‌ కట్‌ షాట్‌లు కొడితే.. ఇక్కడ అజారుద్దీన్‌నే రేవంత్ కట్‌ చేశారని కేటీఆర్ అన్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ది చెప్పడానికి మైనారిటీలు కలిసి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయమైంది.. కానీ మెజార్టీ ఎంత అన్నదే తేలాలన్నారు.