Liquor Draw | ‘లక్కే’ ఇక్కడ నిజమైన ‘కిక్కు’..!

రాష్ట్రంలో మద్యం దుకాణం దక్కడం పూర్తిగా లక్కు పై ఆధారపడింది. ఎవరెన్ని దరఖాస్తులు సమర్పించినప్పటికీ డ్రాలో దక్కే అదృష్టమే ఆఖరికి ఫలితాన్ని నిర్ణయించే పరిస్థితి. ఈ సారి మద్యం షాపులకు టెండర్లు నిర్వహించడం ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం లభించింది.

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్రంలో మద్యం దుకాణం దక్కడం పూర్తిగా లక్కు పై ఆధారపడింది. ఎవరెన్ని దరఖాస్తులు సమర్పించినప్పటికీ డ్రాలో దక్కే అదృష్టమే ఆఖరికి ఫలితాన్ని నిర్ణయించే పరిస్థితి. ఈ సారి మద్యం షాపులకు టెండర్లు నిర్వహించడం ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం లభించింది. టెండర్లు దక్కించుకున్న వారు సర్కారు అండదండలతో మద్యం ప్రియులకు ‘మాంచీ’ కిక్కు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు సంప్రదాయ వ్యాపారులు సిండికేట్ గా మారి షాపులను పొందేందుకు అదృష్టవంతులతో బేరసారాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సర్కారుకు సర్వదా టాక్స్ పేయర్లుగా మారేందుకు మద్యం ప్రియులు మరోసారి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. దీంతో 95,137 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2854 కోట్లు ఆదాయం లభించింది. ఈ సారి ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షలు చొప్పున ఫీజు వసూలు చేశారు. గతంతో పోల్చితే ఒక దరఖాస్తుకు లక్ష పెంచారు. 2023లో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా ఆ ఏడాది రూ.2640 కోట్ల ఆదాయం వచ్చింది. తాజాగా ఫీజు రూ.3లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గతం కంటే కొంత ఎక్కువ ఆదాయం వచ్చింది. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారి గడువు కూడా పెంచారు. బీసీ రాష్ట్ర బంద్, బ్యాంకుల మూసివేత కారణంగా దరఖాస్తులకు గడువు పొడిగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు డ్రా తీసేందుకు సానుకూల నిర్ణయం ప్రకటించింది. దీంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉదయం నుంచి డ్రా తీసే కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రమంతా ఇదే హడావుడి నెలకొంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈప్రక్రియ సజావుగా ముగిసినట్లు సమాచారం. పలు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్లు రద్దు చేసుకుని మద్యం షాపుల డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రక్రియ కావడంతో అధికారులు సైతం దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రా హడావుడి కనిపించింది.

షాపు దక్కడం పూర్తి లక్కు..

ఎవరు ఎన్ని షాపులకు, ఎన్ని దరఖాస్తులు చేశారనేది పక్కనపెడితే డ్రాలో షాపు దక్కిన వారే ఇక్కడ అదృష్టవంతులు. ఎన్ని దరఖాస్తులు చేసినప్పటికీ డ్రా తీస్తే అవకాశం దక్కని వారు హతాశులుగా మారుతున్నారు. ఈ వ్యవహారమంతా పూర్తిగా డ్రా పై, లక్కుపై ఆధారపడడంతో షాపులను ఎలాగైనా దక్కించుకోవాలనుకునే వారు అనేక నమ్మకాలను కలిగి ఉంటారు. కొందరైతే తమ భార్య, తల్లి పేరుతో, ముహుర్తం ప్రకారం, తమ జ్యోతిష్కుడు చెప్పిన సమయం ప్రకారం అనేక సెంటిమెంట్లను పాటిస్తూ దరఖాస్తులు చేస్తుంటారు.

పెరిగిన సిండికేట్లు?

కొందరైతే ముందు జాగ్రత్తగా ‘సిండికేట్’గా మారి దరఖాస్తులు చేసుకోవడం కొంత కాలంగా రివాజుగా మారింది. గమ్మత్తేమిటంటే ఒకే వ్యక్తి రెండు, మూడు సిండికేట్లలో సైతం సభ్యులుగా ఉంటున్నారు. సంప్రదాయంగా మద్యం వ్యాపారులుగా మారిన వారు, ఈ వ్యాపారం తప్ప మరో వ్యాపారం తెలియని వారు చివరికి వరకు షాపులు దక్కించుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డబ్బుండి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకుని అనూహ్యంగా డ్రాలో షాపులు దక్కించుకుంటున్నారు. ఇలాంటి వారికి వ్యాపార అనుభవం లేకపోవడంతో పరోక్ష అగ్రిమెంట్లతో ఇతరులకు అప్పగించడమో? లేక పోతే ‘వ్యాపార భాగస్వాములు’గా మారి ఆశావాహ అనుభవజ్ఞులకు షాపుల నిర్వహణ అప్పగించడం సాధారణంగా మారింది. గతాని కంటే ఒక్కో దరఖాస్తుకు రూ. లక్ష పెంచినప్పటికీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి పలు కారణాలున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆశించిన ఆదాయం ప్రభుత్వానికి రాలేదంటున్నారు. దరఖాస్తు ధర భారీగా పెరిగినందున కొందరు అతి జాగ్రత్తపరులు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. రియలెస్టేట్ వ్యాపారులు, కొందరు ఉద్యోగులు ఈ రంగం నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. దరఖాస్తులు ఎక్కువ చేసి ఎక్కువ డబ్బు నష్టపోవడం కంటే సిండికేట్ గా మారడం వల్ల ఏదో ఒక షాపు దక్కినా కొంతైనా ప్రయోజనం ఉంటుందని పలువురు వాటిల్లో వాటా దారులుగా మారిపోయినట్లు చెబుతున్నారు.

హమ్మయ్య…అబ్కారీ శాఖ

మద్యం వ్యాపారం చేయడం కూడా అందరికీ సాద్యం కాదని, ఈ ‘ముద్ర’ వేసుకునేందుకు కొత్తవారు ఆసక్తికనబరచకపోవడంతో ఈ సారి దరఖాస్తులు తగ్గాయిని భావిస్తున్నారు. ఈ కారణంగా సర్కారు ఆశించిన ఆదాయం రానప్పటికీ గతం కంటే అదనంగా ఆదాయం లభించడంతో సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నట్లు సమాచారం.