విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(Malla Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లుగా మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి పాలు అమ్మి, పూలు అమ్మి.. వేల ఎకరాలు కబ్జా పెట్టిండని..ఈయనతో పేదలకు ఒరిగిందేమి లేదని కవిత విమర్శించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలు(Medchal constituency issues) తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని, ప్రైవేటు విద్యాసంస్థల హాబ్, గంజాయికి అడ్డాగా మారిపోయిందని, ఎక్కడా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉందని ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీలు, యూనివర్సీటీలు త్ప ప్రజలు మాత్రం బాగుపడలేదన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైనా జరిగింది అంటే డంప్ యార్డ్ సమస్య కొంత తీరిందని, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్లీ ఆ సమస్య డబుల్, త్రిబుల్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని పెన్షన్లు వచ్చాయని, అంతకుమించి అభివృద్ధి ఏమీ జరగలేదు అని విమర్శించారు. మేడ్చల్ ను చాలా అభివృద్ధి చేసిన అని మల్లారెడ్డి చెబుతున్నప్పటికీ ఎక్కడ చూసిన సమస్యలే కనిపిస్తున్నాయని ఆరోపించారు. లేబర్ మినిస్టర్ గా పనిచేసిన మల్లారెడ్డి కనీసం మానవ హక్కుల గురించి ఆలోచించలేదు అన్నారు. తాగు నీరు, రోడ్లు, కరెంట్, స్కూల్స్, హాస్పిటల్స్ కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
జీవో నంబర్ 58, 59లో భాగంగా భూముల క్రమబద్ధీకరణకు పేదలతో డబ్బులు కట్టించుకున్నా నేటికీ రిజిస్ట్రేషన్లు కాలేదని కవిత వెల్లడించారు. మాజీ మేయర్, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు ఎలా రిజిస్ట్రేషన్ జరిగింది? ప్రజలకు ఎందుకు కాలేదో విచారణ జరుపాలన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు వరకు వెళ్తాను’ అని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ధరణితో ఇక్కడి లక్ష్మాపూర్ రైతుల సమస్యలు కాలేదని ఆరోపించిన రేవంత్ రెడ్డి భూమాత తెచ్చిన రెండేళ్లుగా వారి సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇక్కడి విషయాలన్నీ తెలుసు అని, రెండేళ్లు అయిన తర్వాత కూడా పాస్ బుక్ లు రాలేదు అని, రైతు భరోసా కూడా ఇక్కడి రైతులకు రాలేదని కవిత వివరించారు. లక్ష్మాపూర్ లో ఉన్న రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
