Minister Vivek | ప్రజల అభివృద్ధికి కాదు.. నాయకుల అభివృద్ధికి పని చేసిన బీఆర్ఎస్ : మంత్రి వివేక్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి గడపగడప ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ లోని బాలాజీ నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కార్మిక, గనుల శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి గడపగడప ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్ లోని బాలాజీ నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. స్థానిక సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల దెబ్బతినడం, కాలువలు మూసుకుపోవడం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. ప్రజల అభివృద్ధి కోసం కాకుండా, వారి నాయకుల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన ఆ పాలనను ప్రజలు విస్మరించారని తెలిపారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని మంత్రి వివేక్ హామి ఇచ్చారు. మీ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని మంత్రి భరోసానిచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోందని వివరించారు. మహిళల స్వయం సహాయక సమూహాల ద్వారా కోటీశ్వరులుగా మారే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. నవంబర్ 11న జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని, తద్వారా నియోజకవర్గ అభివృద్ధికి బలం చేకూరుతుంది అని మంత్రి వివేక్ ప్రజలకు పిలుపునిచ్చారు.