విధాత, హైదరాబాద్ : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో(Supreme Court) సవాల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, (Telangana Government) సిద్దమవుతున్నట్లుగా తెలుస్తుంది. హైకోర్టు స్టేపై ఏం చేయాలన్నదానిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రులు, న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పూర్తి వివరాలు శుక్రవారం అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి.
ఉత్తర్వుల్లో రిజర్వేషన్లు 50శాతం దాటకుండా గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు పేర్కోనడం..పెంచిన 17శాతం సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని సూచించడం జరిగింది. హైకోర్టు సూచనల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి న్యాయనిపుణులతో చర్చించి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.