Harish rao | విద్యాశాఖ మంత్రిగా చదువు రాని రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

ఎన్నికల ముందు నిరుద్యోగులను వేడుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికలయ్యాక మొండి చెయ్యి చూపిస్తున్నారని.. వారిని నిరంకుశంగా అణిచివేస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు.

Harish Rao

విధాత :
చదువు రాని..దేశంలో ఎక్కువ కేసులు ఉన్న రేవంత్ రెడ్డి విద్యాశాఖ, హోంమంత్రి అయ్యారు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కమీషన్లు, వసూళ్లు పంపకాల్లో తేడాలు వచ్చి ముఖ్యమంత్రి, మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గురువారం నిర్వహించిన నిరుదోగ్య బాకీ కార్డు ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్వలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జాబులు నింపుతలేరు.. కానీ తమ జేబులు నింపుకుంటున్నారని హరీశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియమాకపత్రాలు పంచి తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5 వేలు మాత్రమేనని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో నిరుద్యోగ యువత ఆలోచించాలని సూచించారు.

ఎన్నికల ముందు నిరుద్యోగులను వేడుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికలయ్యాక మొండి చెయ్యి చూపిస్తున్నారని.. వారిని నిరంకుశంగా అణిచివేస్తున్నారని హరీశ్ రావు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించడానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీకు ఒక అవకాశం అని నిరుద్యోగులకు సూచించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి బస్సు యాత్ర చేసిన నిరుద్యోగులు, ఇప్పుడు కాంగ్రెస్ కళ్లు తెరిపించాలంటే దండు కట్టి బయలుదేరి వాళ్ళను ఓడించాలని కోరారు. నిరుద్యోగులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోసం చేశారని అన్నారు. దీని వల్లనే తాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయారని వాళ్లకు అర్థం కావాలని హరీశ్ రావు అన్నారు.