విధాత: పది పరీక్షల తొలి రోజు వికారాబాద్ జిల్లాలో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటన మరువక ముందే తెలంగాణలోనే మరో జిల్లాలో పది పరీక్షల విద్యార్ధుల జవాబుల కట్ట ఒకటి మాయం కావడం సంచలనంగా మారింది.
వివరాళ్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో ఉట్నూరులో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన తెలుగు జవాబుల పత్రం కట్ట మాయమైంది. అక్కడ ఉన్న వెయ్యికి పైగా విద్యార్ధుల కోసం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ముగియగానే విద్యార్ధులు రాసిన జవాబు పత్రాలను ఆయా కేంద్రాల ఇన్‌చార్జీలు పోస్టాఫీసులో అప్పగించారు.
అయితే పోస్టల్ సిబ్బంది ఆన్సర్ షీట్లనన్నింటినీ 11 కట్టలుగా కట్టి ఇన్విజిలేషన్ కేంద్రాలకు తరలించేందుకు ఆటోలో బస్టాండ్‌కు తీసుకువెళ్లారు. బస్సులో వేసే క్రమంలో మరో సారి ఆన్సర్ షీట్ బండిల్స్ ను లెక్క బెట్టగా 11కు గానూ పది మాత్రమే ఉండటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తీసుకు వస్తున్న క్రమంలో ఆటో నుంచి పడిపోయి ఉండిచ్చని వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా వారు హుటాహుటిన ఆటో ప్రయాణించిన మార్గంలో వెతికారు. అయినా ఎక్కడా ఆన్సర్ షీట్ల బండిల్ కనిపించలేదు.
దీందో తపాలా కార్యాలయం సబ్ పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఉట్నూరు ఎస్సై భరత్ సుమన్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరీక్ష జవాబుల కట్ట మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.