Cold Wave | హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా చలి పులి పంజా విసురుతోంది. ప్రజలను చలి( Cold Wave ) గజగజ వణికిస్తుంది. ఎముకలు కొరికే చలికి వృద్ధులు, పసి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ( Weather Department ) అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిన్న సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు శీతల, అతిశీతల గాలులు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నెల 14 నుంచి పొగ మంచు పెరిగే అవకాశం ఉందన్నారు. శీతల గాలులు, పొగ మంచు వల్ల ప్రజలపై చలి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రత
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రధానంగా మన్యం జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో కనిష్ఠంగా 5.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది.
ఆ 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు
రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో ఏకంగా 8 డిగ్రీల లోపే నమోదు కావడం తీవ్రతను తెలుపుతోంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు తెలంగాణ వైపునకు వీస్తున్న కారణంగా చలి తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కన్నా 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. జనగామ మినహా అన్ని జిల్లాల్లోనూ 10 డిగ్రీల లోపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సూచించింది. రాష్ట్రంలో ఉన్న 32 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
