కేంద్ర బడ్జెట్ సమావేశాలు (Union Budget 2026) ప్రారంభమయ్యాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంట్ (Parliament)లో ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో నేడు పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వేను తీసుకొచ్చారు నిర్మలమ్మ. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సర్వే (Economic Survey) అంటే ఏమిటి..? బడ్జెట్‌కు ముందే ఎందుకు ప్రవేశపెడతారు..? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థిక సర్వే అంటే..
గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఆర్థిక సర్వే. ఏటా దీని ఆధారంగానే కేంద్ర బడ్జెట్ రూపకల్పన ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలను చేస్తుంది. ఈ సర్వే జీడీపీ, వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి వంటి వివిధ కీలక విషయాల గురించి వివరిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన వేగంతో ముందుకు నడిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సైతం ఈ సర్వే హెలైట్ చేస్తుంది.
కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా.. ప్రధాన రంగాలైన వ్యవసాయం, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల కలుగుతున్న ఫలితాలను కూడా విశ్లేషిస్తుంది.
బడ్జెట్‌కు ముందు రోజే..
ఈ ఆర్థిక సర్వే.. ప్రధాన ఆర్థిక సలహాదారు నాయకత్వంలో తయారవుతుంది. సీఈఏ, ఆర్థికవేత్తలు, విశ్లేషకుల బృందంతో కలిసి వివిధ విభాగాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి డేటాను సేకరించి వివరణాత్మక నివేదికను రూపొందిస్తుంది. నివేదిక తయారయ్యాక బడ్జెట్‌కు ఒక రోజు ముందు పార్లమెంట్‌లో ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 1950-51 నుంచి యూనియన్ బడ్జెట్ తోపాటు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెట్టే వారు. అయితే, 1960వ దశకం నుంచి కేంద్ర బడ్జెట్ సమర్పించడానికి ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశ పెడుతూ వస్తున్నారు.
రెండు విభాగాలుగా ఆర్థిక సర్వే..
ఆర్థిక సర్వే సాధారణంగా రెండు విభాగాలుగా తయారవుతుంది. తొలిభాగంలో ఆర్థిక ధోరణులు, ఆర్థిక అభివృద్ధి, రంగాల పరితీరుపై దృష్టి పెడుతుంది. రెండోది పేదరికం, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణ ఆందోళనలు, వాణిజ్య సమతుల్యత, విదేశీ మారక నిల్వలు వంటి ఆర్థిక అంచనాలపై దృష్టి సారిస్తుంది.
పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరం..
ఆర్థిక సర్వే పెట్టుబడిదారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎక్కడ మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నయో అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఆర్థిక సర్వేను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థ స్థితి గురించి గణనీయమైన డేటాను అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులతో పాటు పౌరులు తదితర వాటాదారులందరూ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక వ్యూహం, లక్ష్యాలను అంచనా వేసేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి :
Horoscope | గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి బంధు మిత్రులతో వివాదాలు..!
SBI POs Monthly Salary : ఎస్‌బీఐ పీవో నెల జీతం రూ.1.25 లక్షలు.. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ
