Site icon vidhaatha

భద్రకాళి బండ్‌పై 150 అడుగుల జాతీయ జెండా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలోని భద్రకాళి బండ్‌ పైన నూతనంగా ఏర్పాటుచేసిన ఎత్తైన జాతీయ జెండాను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా ఆకర్షణీయంగా ఏర్పాటుచేసిన ఈ నూతన జెండాను ఆవిష్కరించారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్యంతో పాటు నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ రాజ్‌లు పాల్గొన్నారు.

భద్రకాళి బండ్ పై రూ 25 లక్షల వ్యయంతో 150 అడుగుల ఎత్తుతో రూపొందించారు. అదేవిధంగా భద్రకాళి చుట్టూ నూతనంగా చేపట్టిన బండ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు బండ్ ను చూసేందుకు వస్తున్నారు. సుందరీకరణ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి.

సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఉండే భద్రకాళి పరిసరాలను సందర్శించి నగర వాతావరణం నుంచి కాసేపు దూరంగా ఉండేందుకు భద్రకాళి బండ్‌ను నగరవాసులు ఆశ్రయిస్తున్నారు. పిల్లాపాపలతో సెలవు రోజు గడిపేందుకు ఆటవిడుపుగా భద్రకాళి బండ్ ఉపయోగపడుతుంది.

సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ప్రాంతం కావడంతో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ఆకర్షణీయంగా ఉండేందుకు 150 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను బండ్ పైన ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన బండ్‌కు మరింత శోభను ఈ జాతీయ జెండా కలిగిస్తోంది.

Exit mobile version