Water Scarcity | విధాత: ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్యల్లో ఒకటైన నీటి ఎద్దడి (Water Scarcity) .. మరిన్ని దేశాలకు విస్తరించిందని తాజా అధ్యయనం (Study) ఒకటి వెల్లడించింది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సరిగా లేకపోవడం, పారిశ్రామికీకరణ నీటి కొరతకు దోహదం చేస్తున్నాయని అభిప్రాయపడింది. దీని వల్ల వచ్చే దుష్పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని, సమాజాన్నిపర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆ అధ్యయనం తెలిపింది.
వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ అక్వెడెక్ట్ వాటర్ రిస్క్ అట్లాస్ (World Resources Institute Aqueduct Water Risk Atlas) ఇటీవల వెలువరించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భారత్ సహా కనీసం 25కి పైగా దేశాలు వాటర్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో జనాభా సుమారు ప్రపంచజనాభాలో నాలుగో వంతుకు సమానం. అంతే కాకుండా ప్రపంచంలో 400 కోట్ల మంది.. అంటే మొత్తం జనాభాలో సగం మంది ఏడాదిలో కనీసం ఒక నెల రోజులైనా నీటి కొరత వల్ల ఇబ్బంది పడుతున్నారు.
2050 నాటికి మొత్తం జనాభాలో 60 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటారని ఈ అధ్యయనం అంచనా వేస్తోంది. 2050 నాటికల్లా 70 ట్రిలియన్‌ల మార్కెట్ నీటి ఎద్దడి ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. ఇది ప్రపంచ జీడీపీలో 31 శాతానికి సమానం. ఒక్క ఇండియా, మెక్సికో, ఈజిప్ట్, తుర్కియో ఈ నాలుగు దేశాల్లోనే తీవ్రమైన సమస్య ఏర్పడే ప్రమాదముంది.
నాలుగేళ్లకోసారి విడుదలయ్యే ఈ అధ్యయనం.. బహ్రెయిన్, సిప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్‌లను తీవ్ర ప్రభావానికి గురయ్యే దేశాల జాబితాలో చేర్చింది. ఈ దేశాల్లో నీటి కొరతతో పాటు సమీప భవిష్యత్తులో కరవు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరించింది. ఇక్కడి జనాభాలో 83 శాతం మంది తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపింది. దక్షిణాసియా దేశాలను ఒక యూనిట్‌గా తీసుకుంటే ఇక్కడి జనాభాలో 74 శాతం మంది కూడా ఇదే దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని అధ్యయనం పేర్కొంది.
‘మానవ పరిణామానికి, అభివృద్ధికి నీరు అత్యవసరం. దురదృష్టవశాత్తు నీటి వనరులను ఉపయోగించుకోవడంలో మనం విఫలమవుతున్నాం. నేను నీటి పొదుపు చర్యలపై అవగాహన కల్పిస్తూ ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఎవరిలోనూ మార్పురాలేదు’ అని అధ్యయన కర్త సమంతా కుజ్మ వాపోయారు. నీటి సంరక్షణ, పొదుపు అనేది ఏమంత కష్టం కాదని కావాల్సిందల్లా రాజకీయనాయకుల చిత్తశుద్ధేనని అభిప్రాయపడ్డారు.