Site icon vidhaatha

Bahrain | పాస్ పోర్టు పోయి.. 42ఏళ్లు పరాయి దేశంలో! కేర‌ళ వ్య‌క్తి దీన గాధ‌

Bahrain | Kerala

విధాత: ఉన్న ఊరును, కన్నవారిని..కుటుంబాన్ని, బంధుమిత్రులను వదిలి జీవనోపాధికి పరాయి దేశం వలసపోయిన వారి కథలన్ని సుఖాంతంగా సాగవు. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్లిన వారి బాధలు.. కన్నిటీ వ్యథలు మనిషి అనే వాడికి రాకూడదన్న రీతిలో ఉంటాయి. కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్ జీవిత కథ కూడా అలాంటిదే. కేరళలోని పౌడికోణం సమీపంలోని ఓ కుగ్రామానికి చెందిన గోపాలన్ చంద్రన్ 42ఏళ్ల క్రితం 1983లో ఉద్యోగం కోసం బహ్రెయిన్ దేశం వెళ్లాడు. తను పనిచేస్తున్న యజమాని ఆకస్మాత్తుగా చనిపోవడం..తన పాస్ పోర్టు పోవడంతో తిరిగి వచ్చే మార్గం తెలియక 42 ఏళ్లుగా ఆ దేశంలోనే చిక్కుకుపోయాడు. ఇటీవల ఫేస్‌బుక్‌ వేదికగా గోపాలన్‌ తన ఆవేదన వ్యక్తం చేస్తూ తన కుటుంబాన్ని చూడాలని ఉందని ఒక వీడియోలో వాపోయారు.

ఈ వీడియో ప్రవాసీ లీగల్‌ సెల్‌ ఎన్జీవో సంస్థ కంటపడింది. దీంతో గోపాలన్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. వారి ప్రయత్నాలు ఫలించి గోపాలన్ తాజాగా స్వదేశానికి చేరుకున్నారు. 42ఏళ్లుగా పరాయిదేశంలో పడరాని పాట్లు పడి..మాట్లాడేందుకు సైతం తెలిసిన వారెవరు లేక జీవచ్ఛవంలా కాలం వెళ్లదీసిన గోపాలన్ స్వదేశానికి చేరుకుని తన కుటంబాన్ని కలుసుకోవడంతో అమితానందానికి గురయ్యాడు. తనను స్వగ్రామానికి చేర్చిన ప్రవాసీ లీగల్‌ సెల్‌ ఎన్జీవో సంస్థకు కన్నిటీతో కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రవాసీ లీగల్‌ సెల్‌ ఎన్జీవో సంస్థ గోపాలన్ మాదిరిగానే ఉద్యోగం, పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి చేర్చడంలో కృషిచేస్తుంది. ఈ ఎన్జీవో సంస్థలో మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు జర్నలిస్టులు కూడా సభ్యులు. వీరు విదేశాల్లో అన్యాయంగా చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంటారు. గోపాలన్ ను స్వదేశానికి చేర్చడంతో చొరవ తీసుకున్న ప్రవాసీ లీగల్‌ సెల్‌ సంస్థకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Exit mobile version