విధాత : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం బ్యారేజీ వద్ధకు చేరుకుంది. హైద్రాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలు దేరిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిల బృందం బ్యారేజీ వద్దకు చేరుకుంది. అంతకముందు బ్యారేజీని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. బ్యారేజీ వద్ద అధికారులతో సమీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు నిర్మాణం..లాభాలు..నిర్వాహణ వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమీక్షకు బ్యారేజీ నిర్మించిన ఎల్‌ఆండ్‌టీ కంపనీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం 1గంట వరకు బ్యారేజీ వద్ద సమీక్ష అనంతరం మంత్రుల బృందం బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సమీక్ష తర్వాతా పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, బ్యారేజీ కుంగుబాటుపై కుట్ర కోణంలో విషయాలు తెలుసుకుంటామని, కుంగుబాటుకు ప్రాజెక్టు కట్టిన వారే బాధ్యత వహించాలన్నారు.
సమీక్షకు బ్యారేజీ కట్టిన ఎల్‌ఆండ్‌టీ ప్రతినిధులను కూడా పిలిచామన్నారు. సెంట్రల్, స్టేట్ డ్యాం సేఫ్టీ కమిటీల నివేదికలపై కూడా సమీక్షలో చర్చించనున్నట్లుగా తెలిపారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మేం లోపాలను పరిశీలించేందుకు, అసలు ఏం జరిగిందో చూసేందుకు వచ్చామని, ఏ అధికారిపైన మేం కక్ష సాధింపు చర్యలు తీసుకోబోమన్నారు. ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో నిజాలు అధికారులే వెల్లడించి సమీక్షను నడిపించాలని కోరారు.