విధాత: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ రావు (Kota Srinivasa Rao) చనిపోయినట్లు మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై కోట శ్రీనివాస్ రావు స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. మనషుల ప్రాణాలతో ఆడుకునే వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోట శ్రీనివాస్ రావు సూచించారు. ఈ మేరకు కోట శ్రీనివాస్ రావు ఓ వీడియో విడుదల చేశారు.
కోట శ్రీనివాస్ రావు (Kota Srinivasa Rao) మాటల్లోనే.. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను పోయానని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారట. కోట శ్రీనివాస్ రావు దుర్మరణం అని వార్తలు ప్రచారం చేస్తున్నారట. పొద్దున్న ఏడున్నర నుంచి కనీసం ఓ 50 మంది కాల్ చేశారు. వారందరితో ఫోన్‌లో మాట్లాడాను. ఆశ్చర్యం ఏంటంటే ఓ పది మంది పోలీసులు కూడా వచ్చారు.
పెద్దాయన కదా.. పది మంది పెద్దవాళ్లు వచ్చే అవకాశం ఉందని భావించి, సెక్యూరిటీ కోసం వచ్చామని పోలీసులు చెప్పారు. ఇలాంటి వార్తలను అరికట్టాలని పోలీసులకు సూచించాను. ఇలాంటి వార్తలను నమ్మొద్దని మనవి చేస్తున్నాను. డబ్బులు సంపాదించేందుకు చాలా పనులు ఉన్నాయి.. మనషుల ప్రాణాలతో ఆడుకోవద్దు అని కోట శ్రీనివాస్ రావు సూచించారు.