విధాత : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బాహుబలి మూవీ నటుడు సత్యరాజ్(కట్టప్ప) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు సత్యరాజ్ ఏ విషయంలో పవన్ కల్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారంటే అది సినిమాల విషయంలో మాత్రం కాదండోయ్. దేవుడి పేరుతో తమిళనాడులో పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తే ఊరుకోమంటూ తాజాగా సత్యరాజ్ హెచ్చరించారు. మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే తమిళనాడులో చెల్లదన్నారు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మే తమను ఎవరూ మోసం చేయలేరంటూ స్పష్టం చేశారు. తమిళనాట మీ ఆటలు సాగవంటూ పవన్ కల్యాణ్ కు సత్యరాజ్ వార్నింగ్ ఇచ్చారు.
తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ మానాడు సభకు హాజరైన పవన్ కల్యాణ్ ఈ సభలో అధికార డీఎంకే పార్టీపై విమర్శలు గుప్పించారు. హిందువులు.. సనాతాన ధర్మం పరిరక్షణపై మాట్లాడారు. నాస్తికులకు ఏ దేవుడినీ నమ్మాల్సిన అవసరం లేదని..అయితే మన దేశంలో సమస్య ఏమిటంటే నాస్తికులు హిందువులను ఎంపిక చేసుకుని టార్గెట్ చేస్తున్నారు అంటూ పవన్ విమర్శలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ మతం పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నాడని డీఎంకే మంత్రులు విమర్శించారు. పవన్ విమర్శకుల జాబితాలో కట్టప్ప సత్యరాజ్ కూడా చేరిపోయాడు. దేవుడి పేరుతో తమిళనాడులో రాజకీయాలు చేస్తే ఊరుకోం అంటూ పవన్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. పెరియార్ సిద్ధాంతాలను నమ్మిన తమిళ ప్రజలను మీరు మోసం చేయలేరని.. మురుగన్ సభతో మమ్మల్ని మోసం చేశారు అనుకుంటే అది మీ తెలివి తక్కువ తనమే అవుతుందని.. తమిళ ప్రజలు తెలివైనవారని తమిళనాట మీ ఆటలు సాగవని సత్యరాజ్ విమర్శించారు.