CM Revanth Reddy’s strong warning :
విధాత: జర్నలిజం పేరుతో సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే సీఎంగా చెబుతున్నానని.. తోడుకలు తీస్తా… బట్టలిప్పించి రోడ్డుపైన తిప్పిస్తానని శాసన సభా వేదికగా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పెయిడ్ అర్టిస్టులతో పార్టీ ఆఫీస్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో తమపై దుష్ఫ్రచారం చేసిన వారిపై కేసు పెడితే మీకు ఏడుపు ఎందుకొస్తుందని నిలదీశారు. 2014 – 15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వెటకారం చేస్తే ఏడాది పాటు ఆ టీవీ చానళ్లు, పేపర్లపై కేసీఆర్ నిషేధం పెట్టిన సంగతి మరువరాదన్నారు. నిన్న అరెస్టయిన మహిళా జర్నలిస్టు కూడా ఆనాడు ఎస్సీ, ఎస్టీ కేసులో ఉందన్నారు.
ఎవరు జర్నలిస్టులు? ఐఆండ్ పీఆర్, డీఏపీవీ ఆమోదించిన పత్రికా, ప్రసార సాధనాలు ఇచ్చిన ఐడీ కార్డులున్న వారు జర్నలిస్టులా? లేకఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకుని ఇష్టారాజ్యంగా విమర్శించేవాళ్లు జర్నలిస్టులా ? అని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నందున ఓపిక పట్టుకుంటున్నామని.. రక్తం మరుగుతున్నదని అన్నారు. కుటుంబ సభ్యులను అంతేసి మాటలంటుంటే అసలు మీరు మనుషులా.. మీకు భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు లేరా? అని బీఆర్ఎస్ సభ్యులను ప్రశ్నించారు. మీ అమ్మనో , చెల్లినో, భార్యనో తిడితే, ఈ రకంగా మాట్లాడితే నీవు ఊరుకుంటావా? అని కేటీఆర్ ను పరోక్షంగా నిలదీశారు.
నా భార్యనో, బిడ్డనో తిడితే నాకు నొప్పయితది. ఓ ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఇలాంటిది ఏ సంస్కృతి? అని నిలదీశారు. తోడుకలు తీస్తా.. ఒక్కొక్కడిని.. బట్టలిప్పించి రోడ్డుమీద తిప్పిస్తానని సీఎంగా హెచ్చరిస్తున్నానన్నారు. రాజకీయాల్లో ఉంది నేను. కావాలంటే నన్ను విమర్శించండి. నన్ను విశ్లేషించండి. లీగల్ గా ప్రశ్నించండి. ఇంట్లో ఆడవాళ్లను లాగడం ఏంటి ? కుటుంబ సభ్యులపైన, మహిళలపైన ఇష్టరాజ్యంగా విమర్శలు చేసే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? అని మండిపడ్డారు.
రజాకార్లపైన, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ మనదని.. అలాంటి చైతన్య సంస్కృతిని నాశనం చేసి నోటికొచ్చింది మాట్లాడి పోస్టులు చేయించే పైశాచికానందంతో కూడిన విష సంస్కృతిని తెచ్చారన్నారు. వాళ్లు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోని చూడండి.. అన్నం తినబుద్ధి కాదు.. అని అన్నారు. తెలంగాణ సీఎం అయితే బలహీనమైనట్లా? అని ప్రశ్నించారు. నీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వస్తే లక్షలాది మంది నాకోసం వచ్చి బట్టలిప్పదీసి కొడుతారు.. నేను వద్దంటున్నా కాబట్టి.. సీఎంగా బాధ్యతగా ఉండాలని.. రాజ్యంగ వ్యవస్థల మేరకు పనిచేయాలి కాబట్టి ఏమనుకుండా ఊరుకుంటున్నా. అంతేకాని మా చేతగాని తనం కాదు.. అని చెప్పారు.
కేసీఆర్.. మీ పిల్లలకు చెప్పు. మీరు ఏదో మానసికంగా దెబ్బతీసి కుంగతీసి, ఏదైనా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే అట్లా కుదరదు.. హద్దు దాటితే.. మాట జారితే దాని ఫలితాలు ఎట్లా ఉంటాయో అనుభవిస్తారని హెచ్చరించారు. పదవి ఎంతకాలం ఉన్నదని కాదని.. ఎట్లా ఉన్నామన్నదే నేను లెక్క కడుతానని.. పదవి కోసం లాలూచీ రాజకీయం చేయనన్నారు. ఉన్నంత కాలం నిటారుగా ఉంటా.. ఆత్మగౌరవంతో ఉంటా, ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకోను.. అని స్పష్టం చేశారు.
జర్నలిజం చట్టాలను సవరిస్తాం:
ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతది.. కోర్టుకు పోతే బెయిల్ వస్తదనుకుంటే నడవదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే జర్నలిజం చట్టాలను సవరిస్తామన్నారు. భావోద్వేగాలతో కూడిన తెలంగాణ ఉద్యమ కాలంలోనూ కూడా ఇలాంటి విషపూరిత జర్నలిజం సంస్కృతి లేదన్నారు. ఇటువంటి సంస్కృతిని క్షమించే సమస్య లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్…! ఇది వినండి అని.. మీ పిల్లలకు చెప్పండి.. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదని.. ఇక్కడనే పాతర వేయదల్చుకున్నా .. ఉప్పు పాతర వేస్తా అని.. ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే నేను ఎవరిని వదలనని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి విషపూరిత జర్నలిజంపై చర్చ జరగాలన్నారు. ప్రతిపక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్పండి.. మాట్లాడండి.. విమర్శించండి.. సరిదిద్దుకుంటాం.. గౌరవిస్తాం అని అన్నారు. బీజేపీ కూడా మాకు ప్రతిపక్ష పార్టీ అని.. కేంద్రంలో అధికారంలో ఉన్నారని.. వారి అధికారాన్ని మన రాష్ట్రానికి ఉపయోగించేలా చూస్తున్నామన్నారు.
జర్నలిస్టు ఎవరో తేల్చండి
మీడియా మిత్రులకు కూడా అడుగుతున్నానని.. మీ సంఘాలు ఏవైతే ఉన్నాయో.. వాటి ద్వారా మీరు జర్నలిస్టుల లిస్ట్ ఇయ్యండి.. జర్నలిస్టుల డెఫినేషన్ ఏంటో చెప్పండి.. ఆ లిస్టులో ఉన్నోడు తప్పు చేస్తే ఏం శిక్ష విధిస్తారో మీరే చెప్పండని రేవంత్ రెడ్డి కోరారు. లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు.. జర్నలిస్టు కాని వాళ్లను క్రిమినల్ కిందనే చూస్తాం.. ఆ క్రిమినల్స్ కు ఎట్లా జవాబు ఇవ్వాలనో అట్లనే జవాబు చెప్తామన్నారు. ముసుగేసుకుని వస్తే ముసుగు ఊడబీకి బట్టలు ఊడదీసి కొడతామన్నారు.. తమాషాలు చేయవద్దు.. నేను కూడా మనిషిని.. నాకు కూడా చీము నెత్తురు ఉంది.. అన్నిటికి బరాయించుకుంట.. తప్పులను మోసుకుంటా ఏదో కుర్చీలో ఉన్న అని ఏదో వేషాలు వేస్తా అనుకుంటే కుదరదు అని అన్నారు. అన్ని చట్టపరంగానే చేస్తా. పరిధిని దాటను. చట్టపరంగా చేస్తా ప్రతి దానికి ఒక శిక్ష .. విధానం ఉంది.. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి.. నేను కూడా పరిధి దాటను.. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన అని.. ఎవరు జర్నలిస్టు… వాళ్ళ గుర్తింపు కార్డు ఏమిటో మీరు నిర్ణయించండన్నారు. ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి.. వాళ్లని మినహాయిస్తాం ..మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తామని స్పష్టం చేశారు. వాళ్ల అందరి గురించి చర్చిద్దాం.. అవసరమైతే స్పీకర్ అనుమతిస్తే ఒకరోజు దానిమీద సభలో చర్చ పెట్టాలని ఉందన్నారు.
నియంత్రణ ఉండాలి
సభా నాయకుడుగా నా రిక్వెస్ట్ ఒక్కటే.. స్పీకర్ గా మీరు ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి.. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి.. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇదొక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తదని అన్నారు. చట్టసభలు ఉన్నదే చట్టాలు చేయడానికి అని.. చట్టం చేద్దామని.. చట్టాలు చేయడానికి తమరి నేతృత్వంలోఆదేశిస్తే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, ఐఆండ్ పీఆర్ మంత్రులు, జర్నలిస్టు సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి.. చర్చ చేయండని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇది వదిలేసి ఊరుకుంటే ఎవరినో ఒకరిని అన్నారని కాదని .. అందరు ఆవేదన వినే దీని మీద చర్చ జరగాలి అంటున్నానని.. ఇది ఏ మాత్రం మంచిది కాదని..చర్చ జరుగాలి..ఒక మంచి సంప్రదాయానికి తెలంగాణ వేదిక అవ్వాలని.. అందరూ సహకరించాలని.. సభలో ఉన్న సభ్యులందరూ కూడా చర్చించుకుందామన్నారు. జర్నలిజానికి స్వీయ నియంత్రణతో పాటు రాజ్యాంగపరమైన నియంత్రణ కూడా అవసరమే అని చెప్పారు . ఎవరైన పరిధి దాటినప్పుడు ఏ రకంగా శిక్షించాలో దానికి అవసరమైన చట్టాలు చేయడానికి అనుమతించాలని స్పీకర్ ను రేవంత్ రెడ్డి కోరారు.
కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలతోనే బతుకుతారా?
అంతకుముందు అసెంబ్లీ సమావేశాల అజెండాపై స్పందించిన రేవంత్ రెడ్డి 17న కులగణన, 18న ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించాలని నిర్ణయించామని, బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని సభలో పెట్టామన్నారు. బీఆర్ఎస్ హరీష్ రావు, కేటీఆర్ లు వాటిని సభ షెడ్యూల్ లో పెట్టలేదని చెప్పడం విడ్డూరమన్నారు. వీళ్లు అన్నం తింటున్నారా ? అబద్దాలు తింటున్నారా ? ఈ కుటుంబమంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా ? అబద్ధాలపై జీఎస్టీ లేదని ఏది పడితే అదే మాట్లాడతారా? అని నిలదీశారు. అబ్ధాలపై జీఎస్టీ వేయాలని ప్రధానికి సూచించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి సూచించారు. అబద్ధాలపై జీఎస్టీ వేస్తే గానీ ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అబద్ధాలు చెప్పడం మానదని ఎద్దేవా చేశారు.