Bridge |
- ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఘటన
- నలుగురి అరెస్టు.. మెటీరియల్ స్వాధీనం
విధాత: కొన్ని చోరీలు విస్తు గొలుపుతాయి. ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి చోరీ ఒకటి ముంబైలోని మలాడ్‌లో జరిగింది. అదానీ కంపెనీకి చెందిన ఒక ఇనుప బ్రిడ్జిని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో వంతెనను ధ్వంసం చేసి లారీలో తీసుకెళ్లి సామగ్రిని అమ్మేశారు.
ఇంతకీ ఆ సామగ్రి విలువ ఎంతంటె రూ.2 లక్షలు మాత్రమే. ఇనుప వంతెన చోరీకి గురైందని ఆలస్యంగా గుర్తించిన సంస్థ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నలుగురు దొంగలను పట్టుకున్నారు. సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అసలు కథ ఏమిటంటే..
అదానీ సంస్థకు చెందిన ఎలక్ట్రికల్ కేబుళ్లను తరలించేందుకు గత ఏడాది జూన్‌లో మలాడ్ ప్రాంతంలోని ఓ మురికి కాలువపై వంతెన నిర్మించారు. 90 అడుగుల పొడవైన తాత్కాలిక ఇనుప వంతెన నిర్మాణానికి ఆరు వేల కిలోల (ఆరు క్వింటాళ్ల ) ఇనుమును వాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అదే కాలువపై ప్రభుత్వం మరో వంతెన నిర్మించింది.
దాంతో అదానీ సంస్థ నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జి ఉపయోగంలో లేకుండా పోయింది. ఇటీవల ఆ ఇనుప బ్రిడ్జి రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవడంతో పోలీసులు కూడా చోరీ విషయాన్ని గుర్తించలేకపోయారు. జూన్ 26న అదానీ సంస్థ ప్రతినిధికి ఈ వంతెన చోరీ విషయం తెలిసింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోచోట ఉన్న సీసీ కెమెరాలో.. జూన్ 6వ తేదీన ఒక లారీ అక్కడి నుంచి వెళ్లడం రికార్డయింది. ఆ లారీ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపగా నిందితులు దొరికారు. నలుగురిని అరెస్టు చేసి ప్రశ్నించగా.. గ్యాస్ కట్టర్లతో బ్రిడ్జిని ధ్వంసం చేసి ఇనుమును అమ్ముకున్నట్టు అంగీకరించారు.
వంతెన నిర్మాణంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అదానీ సంస్థ ఉద్యోగి చోరీకి సహకరించినట్టు దర్యాప్తులో తేలింది. చోరీకి గురైన వంతెన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నామని అదానీ సంస్థ ప్రతినిధి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.