- ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ వద్ద
- 25 ఏండ్ల తర్వాత రాకపోకలకు మోక్షం
- రోడ్డు ఓపెన్ చేసిన అధికారులు
- మావోయిస్టుల దాడితో రోడ్డు మూసేవేత
- అధికారుల చొరవతో స్థానికుల్లో సంతోషం
విధాత. వరంగల్: సమస్య చిన్నదిగా కనిపించవచ్చు. కానీ, స్థానికంగా యేళ్ళుగా నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించడం మంటే ఆసక్తికరమైందే. ములుగు జిల్లాలో ప్రధాన సెంటర్ గా ఉన్న ప్రాంతాల్లో ఏటూరు నాగారం ఒక్కటి. ములుగు జిల్లా అంటేనే ఎక్కువగా అటవీప్రాంతాన్ని కలిగి ఉంది. పైగా నక్సలైట్ల ప్రభావిత ప్రాంతం. ఈ కారణంగానే ఏటూరునాగారంలో పోలీస్ స్టేషన్ ఎదుట రెండు దశాబ్దాల క్రితం నిలిపివేసిన వాహనాల రాకపోకలకు తాజాగా మోక్షం లభిచింది. నక్సలైట్ల పట్టు బలంగా ఉన్న సమయంలో ప్రధాన రోడ్డుపై ఉన్న ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా, పోలీసుల రక్షణ కోసం రాకపోకలు నిలిపివేశారు. రెండు దశాబ్దాలు దాటింది. చాలా కాలానికి ఇప్పుడు అధికారులు వాహనాల రాక రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ఈ మార్గంలో వాహనాలు వెళుతున్నాయి.
పీపుల్స్ వార్ దాడితో..
2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌పై అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ డైరెక్షనల్ మైన్స్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ పేల్చివేశారు. అప్పటినుంచి పోలీస్ స్టేషన్ ముందు రాకపోకలను నిలిపివేసి గేట్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2016లో జాతీయ రహదారి మంజూరు చేసినప్పటికీ ఈ మార్గంలో పోలీస్ స్టేషన్ ముందు గేట్లు తెరుచుకోలేదు. దీంతో ఐటీడీఏ పిఓ నివాస గృహం చుట్టూ వాహనదారులు నాలుగు మలుపులు తిరిగి వెళ్ళేవారు. దీని వల్ల స్థానికులకు, రాకపోకలు సాగించేవారు నిత్యం ఇబ్బందులు పడ్డారు.ఈ రోడ్డు కూడా పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. కాగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సీతక్క సూచనల మేరకు పరిస్థితిని సమీక్షించిన ఉన్నతాధికారులు రాకపోకలకు అనుమతించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గిందని చెప్పవచ్చు. దీనిపై అధికారుల ఆదేశాల మేరకు అక్కడ స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన గేట్లను తొలగించడంతో శనివారం నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించింది.