విధాత: గత సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఈ సారి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం స్కై ఫోర్స్ అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. భారత దేశ మొదటి వైమానిక దాడి ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో వీర్ పహరియా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుండగా.. సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా విడుదల నేపథ్యంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా ఓటీటీలపై చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్ అయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇండియన్ సినిమా ప్రస్తుతం ఎందుకు ఇంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది సక్సెస్ రేట్ ఎందుకు తక్కువగా ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు అక్షయ్ సమాధానమిస్తూ.. ఓటీటీల వలనే సినిమాలు థియేటర్‌లో ఆడకుండా ఫ్లాప్ అవుతున్నాయని వెల్లడించాడు. నేను ఈ మధ్య కొంతమందిని కలిసినప్పుడు వారితో సినిమాల గురించి మాట్లాడాను. అయితే వారు సినిమాలు థియేటర్‌లో కాకుండా ఓటీటీలో చూస్తున్నాం అని చెబుతున్నారు.
ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర రన్ అవ్వకుండా ఫ్లాప్ అవ్వడానికి ఇదే ముఖ్య కారణం. కరోనా వేవ్ తర్వాత కూడా ఓటీటీలకు అలవాటైన ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్‌కి రావడం క్రమంగా తగ్గించారు. ఈ మధ్య ఈ అలవాటు బాగా పెరిగింది అని తెలిపాడు. ప్రేక్షకులు కూడా ఈ మధ్య సెలక్టివ్‌గా సినిమాలు చూస్తున్నారు. వారికి సినిమా నచ్చితేనే థియేటర్‌కి వెళుతున్నారు. లేకుంటే అదే సినిమాను ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తున్నారు అంటూ అక్షయ్ (Akshay Kumar) చెప్పుకోచ్చాడు. ప్రస్తుతం అక్షయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.