Site icon vidhaatha

Alien Mummies | ఆ మమ్మీలు.. గ్రహాంతర వాసులవేనా?.. మెక్సికన్‌ వైద్యుల పరీక్షల్లో విస్మయం గొల్పే వాస్తవాలు

Alien Mummies |

ఇటీవల కనుగొన్న ‘భూమికి చెందని మానవేతరుల’విగా భావిస్తున్న మమ్మీల’పై ప్రయోగశాలలో క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించిన మెక్సికన్‌ వైద్యులకు విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయని న్యూయార్క్‌ పోస్ట్‌ తెలిపింది. మెక్సికోలోని నూర్‌ క్లినిక్‌లో నిర్వహించిన పరీక్షలను జైమ్‌ ముస్సాన్‌ యూట్యూబ్‌ చానల్‌లో ప్రసారం చేశారు. వీరి పరీక్షల్లో విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. ఈ మమ్మీల కంకాళాలు.. కొన్ని భాగాలను అతికించినవి కాదని, మార్పులు చేసినవి కూడా కాదని తేలింది.

ఇవి మానవులు తయారుచేసినవి కాదనేందుకు ఈ పరీక్షలు బలమైన ఆధారాలుగా చెబుతున్నారు. వీటిని పరీక్షించే క్రమంలో ఇది ఒకే అస్తిపంజరానికి చెందినవని, మానవులు తయారు చేసిన వేర్వేరు భాగాలను కూర్చి, రూపొందించినవి కాదని ధ్రువపడినట్టు మెక్సికన్‌ నావికాదళ కార్యదర్శి కార్యాలయ హెల్త్‌ సైన్సెస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జోస్‌ జెలాక్‌ బెనిటెజ్‌ ప్రకటించారు.

అంతేకాకుండా మరో గొప్ప విషయాన్ని కూడా బెనిటెజ్‌ బృందం కనుగొన్నది. ఒక నమూనా సజీవంగా ఉన్నదని, గర్భస్త దశలో ఉన్నదని గుర్తించారు. ఏలియన్స్‌కు చెందినవిగా భావిస్తున్న ఒక మమ్మీ కడుపులో పెద్దపెద్ద గడ్డలు ఉన్నాయని తేలింది. అవి అండాలే అని వారు బల్లగుద్ది చెబుతున్నారు.

ఈ నమూనాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, దాదాపు పది లక్షలకు పైగా నమూనాలతో సరి పోల్చినప్పుడు.. ఏ ఒక్క డీఎన్‌ఏతోనూ అవి సరిపోలలేదని వైద్యుల బృందం ప్రకటించింది. అవి ఇప్పటి వరకూ శాస్త్ర, మానవ విజ్ఞానానికి తెలియనివని బెనిటెజ్‌ తెలిపారు.

భూభౌతిక పరిణామంతో సంబంధం లేని రెండు మానవేతర మమ్మీలను గతవారం ఒక ప్రజెంటేషన్‌ సందర్భంగా జర్నలిస్టు జోస్‌ జైమే ముస్సాన్‌ వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. రెండు వేర్వేరు పేటికల్లో ఉన్న ఈ మమ్మీలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపాయి. భూమి మీద ఉన్న ఏ జీవి డీఎన్‌ఏతో వీటి డీఎన్‌ఏలో సరిపోలేదని విశ్లేషణలు ధ్రువీకరించాయన్న ముస్సాన్‌.. వీటిని గ్రహాంతరవాసులవిగా ఇప్పుడు ముద్రవేయటం తగదని పేర్కొన్నారు.

పూర్తిగా నిర్జలీకరించిన స్థితిలో ఉన్న ఈ మమ్మీలు 2017కు ముందు నాటివిగా చెబుతున్నారు. వీటిని పెరూ తీర ప్రాంతంలోని నాజ్కా ఇసుక ఎడారుల్లో లోతైన ప్రాంతం నుంచి వెలికి తీశారు. కొండలు, నేలలపై వింత ఆకృతులు చెక్కి ఉన్న ప్రదేశంగా నాజ్కా ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. వాటిని విహంగ వీక్షణం ద్వారా మాత్రమే చూడగలం. ఇవి ప్రాచీన నాగరికతల కాలం నాటివని చెబుతున్నారు.

Exit mobile version