Royal Bengal Tiger | పులిని చూస్తే దాడి చేస్తుందేమోనని ఎవరైనా భయపడతారు. సఫారీ పార్క్ (Safari Park)లో భద్రమైన కేజ్ బండిలో నుంచి లేదా బోనులో బంధించి ఉన్న పులిని చూస్తూనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది వీధిలో కళ్లముందు తిరుగుతూ కనిపిస్తే? మెక్సికో (Mexico)లో కొందరికి ఇటువంటి వింత అనుభవమే ఎదురైంది. కానీ.. వీడియో చివరిలో మాత్రం సీన్ సూపర్ ఇంట్రెస్టింగ్ ఉంది. సాధారణంగా పులులు అడవుల్లో.. మరీ ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాలు, పులుల అభయారణ్యాల్లోనే ఉంటాయి. సాధారణ జనావాసాలకు రావడం చాలా అరుదు. రాయల్ బెంగాల్ టైగర్ ఠీవీ వేరే లెవెల్. ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్దపులి చేసిన హంగామా ఎవరూ మర్చిపోలేరు. తాజాగా మెక్సికోలో ఒక రాయల్ బెంగాల్ టైగర్.. రోడ్లపైకి పిల్లిలా తిరుగుతూ కనిపించింది. దారినపోయేవాళ్లు ఒక్కసారిగా దాన్ని చూసి భయంతో వణికిపోయారు. ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో సహజంగానే నెట్టింట వైరల్‌గా మారింది.
వాస్తవానికి రాయల్ బెంగాల్ టైగర్లు (Royal Bengal Tigers) చాలా దుందుడుకు స్వభావంతో ఉగ్రరూపంతో ఉంటాయి. వాటికి ఉన్న బలం.. వేటాడే నైపుణ్యం ఇతర వన్య మృగాలతో పోల్చితే పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మాటువేసి.. పంజా విసరడం వాటి నైజం. వాటికంటపడిన జీవి ఏదైనా తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అలాంటి రాయల్ బెంగాల్ టైగర్ రోడ్డు మీదకు వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్లు అదిరిపోయారు. ఫుట్‌పాత్ మీద నడిచి వస్తున్న పులిని వీడియో తీసేందుకు ఒక యువతి సాహసం చేసింది. ఆమెతోపాటు చుట్టుపక్కల ఉన్నవారు సైతం పులిని చూసేందుకు ఉత్సాహపడ్డారు. అదే సమయంలో పులికి, వారికి మధ్య ఏమీ లేకపోవడంతో కొంత గాభరాపడ్డారు కూడా. కాసేపటికి ఆ పులి.. ఒక వాహనం దగ్గరకు వెళ్లి.. హాయిగా రెస్టు తీసుకుంది. అయితే.. ఈలోపు ఒక యువకుడు ఒక బెల్టుతో వచ్చి.. పులి మెడకు తగిలించేందుకు ప్రయత్నించాడు. ఆ పులి బెల్టు లేకుండానే ఏ మాత్రం ఇబ్బంది పడకుండా.. ఇబ్బంది పెట్టకుండా బుద్ధిగా అతడి వెంట నడుస్తూ వెళ్లిపోయింది.
Just a Bengal Tiger roaming around town and then gets taken home without any resistance. This happened in Tecuala, Mexico. pic.twitter.com/HYUpDdzSRE
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 26, 2024
ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించినదీ తెలియకపోయినా.. నేచర్ ఈజ్ అమేజింగ్ ఎక్స్‌లో షేర్ చేసే సరికి.. వైరల్ అయింది. ‘పట్టణం నడిబొడ్డున తిరుగాడిన రాయల్ బెంగాల్ టైగర్.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి తీసుకెళ్లిపోయారు’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ ఘటన మెక్సికోలోని టెక్యుయాలాలో చోటు చేసుకున్నట్టు అందులో తెలిపారు. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. అంతేనా.. కామెంట్లు వెల్లువలా వచ్చాయి. ‘ఏదో పులిపిల్ల అయితే ఫర్వాలేదు.. కానీ.. బాగా ఎదిగిన బెంగాల్ టైగర్ అంటే.. కథ వేరు’ అని ఒక యూజర్ రాశాడు. ‘రాయల్ బెంగాల్ టైగర్.. మెక్సి వీధుల్లో తిరగడం.. ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోవడమా? నమ్మలేకపోతున్నా. ప్రకృతి, పట్టణజీవితం అనూహ్యంగా కలిసిపోతున్నాయి’ అని మరొకరు స్పందించారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన 2022 జూన్ 15 నాటిదని డెయిలీ మెయిల్ యూకే పేర్కొన్నది. మెక్సికోలో ఆన్‌లైన్‌లో 25 డాలర్లు చెల్లిస్తే చాలు.. అటవీ మృగాలను సైతం ఇంట్లో పెంచుకోవచ్చట!