Site icon vidhaatha

Amrapali IAS | మళ్లీ తెలంగాణకే ఆమ్రపాలి? ఏపీ ఇచ్చిన పోస్ట్​తో మొదలైన గుసగుసలు

క్యాట్​(CAT) ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌(AP)లో రిపోర్ట్​ చేసిన నలుగురిలో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని ఏపీ టూరిజం ఎండీగా(AP Tourism MD), టూరిజం అథారిటీ సీఈవోగా నియమించింది. ఇక వాకాటి కరుణ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌(Ronald Ross)కు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు.

సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(AP CM Chandrababu Naidu) సమర్థులైన అధికారులకు కీలకమైన పోస్టులు అప్పజెబుతారు. ఆమ్రపాలి సమర్థత గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. అయినా అంత ప్రాధాన్యత లేని పర్యాటక శాఖను కేటాయించడం కొత్త సందేహాలను రేపుతోంది. నిజానికి ఆమ్రపాలికి ఏపీకి వెళ్లడం అసలు ఇష్టం లేదు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్​కళ్యాణ్​(DCM Pawan Kalyan) కూడా మంచి అధికారులను కోరుకుంటారు. కేరళలో ఉన్న కృష్ణచైతన్యను ఏపీకి రప్పించుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఆయన కూడా ఆమ్రపాలి విషయంలో ఏం పట్టించుకున్నట్లు లేదు. ఈ విషయంపైనే తెలంగాణ ఐఏఎస్​లలో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ నిజమయ్యేలాగానే పరిస్థితులున్నాయి.

మరోవైపు తెలంగాణలో అతి కీలకమైన గ్రేటర్​ హైదరాబాద్​ మునిసిపల్​ కార్పొరేషన్​ కమిషనర్(GHMC Commissioner)​గా పనిచేస్తున్న ఆమ్రపాలిని ఉన్నట్లుండి ఆంధ్రప్రదేశ్​కు పంపడంతో రేవంత్​కు నచ్చలేదు. తాను ఎంత ఇష్టపడి తెచ్చుకున్న ఐఏఎస్​ను ఏపీకి పంపడం తెలంగాణ ముఖ్యమంత్రికి ఇష్టంలేదు. ఆమెను సమర్థవంతంగా వాడుకోవాలని అనుకున్న రేవంత్​ కీలకమైన జీహెచ్​ఎంసీని అప్పజెప్పారు. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే అత్యంత సమర్థులైన అధికారి ఉండాలనుకున్న రేవంత్​ ఇప్పుడు ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి, తరువాత కేంద్రంతో రాయబారాలు మొదలుపెట్టినట్లుగా సచివాలయంలో గట్టిగా వినిపిస్తోంది. చంద్రబాబు కూడా ఇష్టం లేని ఆమ్రపాలితో పనిచేయించుకోవడం కష్టమని భావించే అప్రాధాన్య పోస్టులో నియమించినట్లు తెలుస్తోంది. మరో స్ట్రిక్ట్​ ఆఫీసరైన రోనాల్డ్​రాస్​కు అసలు పోస్టింగే ఇవ్వలేదు. తనను కూడా రేవంత్​ అడిగినట్లు, అందుకే ఆయనను పక్కకు పెట్టినట్లు సమాచారం.

ఈ దశలో తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఒక కేంద్ర మంత్రి(Central Minister)తో చాలా సీరియస్​గా రాయబారాలు నడుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. ఈ ప్రయత్నాలకు చంద్రబాబు సహకారం కోరిన రేవంత్​, తన తరపున ఢిల్లీని ఒప్పించాల్సిందిగా అడిగారని తెలిసింది. దానికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, ఇప్పటికే కేంద్రాన్ని ఆమ్రపాలి, రోనాల్డ్​రాస్​లను తిరిగి తెలంగాణకు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిసింది.

చంద్రబాబు ‘అభ్యర్థన’ను తిరస్కరించే పరిస్థితిలో కేంద్రం లేనందున, రేవంత్​ ప్రయత్నాలు సఫలీకృతమైనట్లే కనిపిస్తోంది. క్యాట్​ ఈమేరకు ఆ ఇద్దరు ఐఏఎస్​లను తిరిగి తెలంగాణకు పంపేందుకు శాఖాపరమైన ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది.

Exit mobile version