Hyderabad Musi Project | జీవోలతో ఇళ్లు జీరోయేనా? మధు పార్క్‌ రిట్జ్‌పై ఒక తీరు.. ఆదిత్య కేడియాపై మరో తీరు

మూసీని బాగు చేస్తామంటే ఎవరొద్దంటారు? గత ప్రభుత్వం కూడా చడీ చప్పుడు లేకుండానే మూసీ వెంట చాలా అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అడ్డగోలుగా ఇండ్లు కూల్చకుండానే చేయడానికి చాలా పని ఉంది. మూసీ అభివృద్ధిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా, ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టుగా మలచి ప్రణాళికలు రూపొందించడంతోనే సమస్య అంతా.

విధాత, హైదరాబాద్ :
Hyderabad Musi Project | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన విచిత్రంగా ఉంది. ప్రభుత్వం కొత్త జీఓ ఇచ్చిన ప్రతిసారి ప్రైవేట్ ఆస్తుల విలువ జీరో విలువగా మారితే… మరో రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తే ఈ ముఖ్యమంత్రి విలువ జీరోనే కదా! మీరేమైనా శాశ్వత ముఖ్యమంత్రా? మీ హోదాలు జీరో కావచ్చు. మీ జీఓలు జీరో కావచ్చు. స్థిరాస్తుల విలువ ఎప్పుడు జీరో కాజాలదు. బండ్లగూడ జాగీర్ లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్ మెంటు యజమానులకు భూమికి బదులుగా ఏడెకరాల భూమి ఎందుకిస్తారు? కోట్ల రూపాయల డిపాజిట్లు ఎందుకు చేస్తారు? అయినా ఈ సెలెక్టివ్ దాడి ఎందుకు చేస్తున్నట్టు? ఆదిత్య కేడియా రియల్టర్స్.. ఎప్పుడో కాదు ఇప్పడే ఇటు మూసీ నదీ గర్భంలో, అటు రోడ్డు మీదికి వచ్చి ఒక మహా నిర్మాణం చేస్తున్నారు. ఆ రియల్టర్ కోర్టునుంచి ఆదేశాలు తెచ్చుకుని ఆపకుండా పనిచేసుకుపోతున్నారు. మీడియా, రాజకీయ సంస్థలు, పర్యావరణ ప్రేమికులు సైతం ఆ నిర్మాణంపై గగ్గోలు పెడుతున్నారు. కోర్టు ఆదేశాలవల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని హైడ్రా అధికారులు సైతం చెబుతున్నారు. ఇప్పుడు కడుతున్నవారే కోర్టు ఆదేశాలు తెచ్చుకోగలిగినప్పుడు ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం నుంచి ఇళ్లల్లో ఉంటున్నవాళ్ళు అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ తెచ్చుకోలేరా? ఎప్పుడో కట్టిన ఇళ్ళమీద ఇంకెప్పుడో తెచ్చిన జీఓ ను చూపించి తెలివి ప్రదర్శించే బదులు ఇప్పుడు కొత్తగా జరుగుతున్న నిర్మాణాలను ఆపవచ్చుగా?

మూసీ నది.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల్లో ప్రారంభమై హైదరాబాద్ నగరం మీదుగా నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. పూర్వం ఈ నదిని ముచుకుందా అని కూడా పిలిచేవారు. మూసీ నదిపై హైదరాబాద్ మహానగరంలో ఏడు వంతెనలు కూడా ఉన్నాయి. 1980 తరువాత నగర శివారులోని పరిశ్రమల నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థజలాలను మూసీలోకి వదలడం మూలంగా మురికి కాలువగా అవతరించింది. జంటనగరాల్లో కొన్ని ప్రాంతాల నుంచి మురుగునీరు కూడా దీనికి తోడు కావడంతో భరించలేని విధంగా దుర్వాసన వెదజల్లుతోంది. ఈ నది విషయంలో నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించడంతో తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14 వంతెనల నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. 2023లో అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ బ్రిడ్జిలకు శంకుస్థాపన కూడా చేశారు. మూసీని బాగు చేస్తామంటే ఎవరొద్దంటారు? గత ప్రభుత్వం కూడా చడీ చప్పుడు లేకుండానే మూసీ వెంట చాలా అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అడ్డగోలుగా ఇండ్లు కూల్చకుండానే చేయడానికి చాలా పని ఉంది. మూసీ అభివృద్ధిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా, ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టుగా మలచి ప్రణాళికలు రూపొందించడంతోనే సమస్య అంతా.

సుందరీకరణ పేరుతో వేలాది మంది నిరాశ్రయులు

మూసీ సుందరీకరణ పేరుతో వేలాది మంది ని నిరాశ్రయులను చేసేందుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారనే విమర్శలు గత రెండు మూడు వారాలుగా వింటున్నాం. బండ్లగూడ జాగీర్ పరిధిలో టిప్పుఖాన్ బ్రిడ్జ్‌ సమీపంలో దశాబ్ధకాలం క్రితమే భారీ రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ ‘మధు పార్క్ రిట్జ్‌’ను మూసీ పరీవాహకం వెంట నిర్మాణం చేశారు. అప్పుడున్న మున్సిపల్ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేయగా, వందల మంది అప్పు,సప్పులు చేసి, మరికొందరు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కొనుగోలు చేసుకున్నారు. తమకంటూ సొంత గూడు ఉందని వారంతా సంబురపడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిడుగులాంటి ప్రకటన చేశారు. దీంతో మూడు వారాలుగా ఆ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నవారికి నిద్రాహారాలు కరువయ్యాయి. ఫేజ్ ఏ1 కింద హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు మొత్తం 9.2 కిలోమీటర్ల మేర భూమిని సేకరించనున్నట్లు స్థానిక రెవెన్యూ అధికారులు ప్రకటించారు. ఫేజ్ ఏ2లో గండిపేట నుంచి గాంధీ సరోవర్ దాకా 11.8 కిలోమీటర్ల మేర భూములు సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భూముల సర్వే నంబర్ల ప్రకారం గ్రామాలవారీగా భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. నదికి రెండు వైపులా 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ భూ నిర్వాసితుల హాహాకారాలతో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటుగట్టుకుంటున్నది. భారీ అపార్ట్‌మెంట్లను కూల్చివేసి, అక్కడ నివాసం ఉంటున్న వందల మందిని నిరాశ్రయులు చేసి చేసేది అభివృద్ధి కాదని పలు వర్గాల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి పట్టు వదలకుండా ముందుకు వెళ్తానంటున్నారు. మహాత్మాజ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో మహిళా దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిర్వాసితులను మరింతగా వేదనకు గురిచేస్తున్నాయి. ఏడు ఎకరాల్లో మధు పార్క్ రిట్జ్ ఈసా నది ఒడ్డున ఉందని, అది నాలా అని చెప్పి 2004 లో మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారన్నారు. 2012 లో నది, నాలా నది బఫర్ జోన్ పై చట్టాన్ని సవరించారని, ఆ మేరకు నది పక్కన 50 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు ఉన్నా కూల్చివేస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ అపార్ట్ మెంట్ పై పూర్తి నిషేధం విధిస్తున్నామని, క్రయవిక్రయాలు జరగడానికి వీలు లేదన్నారు. మధు పార్క్ వాసులకు మరో చోట ఏడు ఎకరాల భూమి ఇచ్చి, ఇళ్ల నిర్మాణం ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఆఫర్‌ ఇచ్చారు.

కోర్టు ఆదేశాల పేరుతో ఆదిత్య కేడియా కూల్చివేతలకు బ్రేక్

మూసీ నదీ గర్భాన్ని కబ్జా చేసి పట్టపగలు బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న ఆదిత్య కేడియా రియల్టర్స్ కోర్టు ఆదేశాల పేరుతో పనులు సాగిస్తున్నా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైడ్రా కమిషనర్ రంగనాథ్ చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కోర్టు ఆదేశాలను పై కోర్టులో సవాల్ చేయకుండా ఆదిత్య కేడియాకు సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మధు పార్క్‌ రిట్జ్‌కు ఒక న్యాయం.. ఆదిత్యకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పై స్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే కూల్చివేతలు చేపట్టకుండా కోర్టు ఆదేశాలు పేరు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు. పై వారికి ముట్టచెబితే ఒక రకంగా, లేదంటే మరో రకంగా హెచ్ఎండీఏ, హైడ్రా ప్రవర్తిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆదిత్య కేడియా రియల్టర్‌కు అనుకూలంగా వచ్చిన ఆదేశాలను పై కోర్టు లో సవాల్ చేసి కూల్చివేతలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

లక్షన్నర ఇండ్లు నేలమట్టం, 24వేల ఎకరాల సేకరణ

మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో సుమారు ఒక లక్షన్నర మంది ఇండ్లు కోల్పోతుండగా, 24వేల ఎకరాలను సేకరించనున్నారు. దశల వారీగా ప్రాజెక్టును అమలు చేయడం మూలంగా ఇప్పటికిప్పుడు నిరాశ్రయుల సంఖ్య తక్కువగా కన్పిస్తున్నది. నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర విస్తరించి ఉన్న నిర్మాణలన్నింటిపై ప్రభావం ఉండనున్నది. గత డిసెంబర్‌లో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 3,200 ఎకరాలు సేకరిస్తామని, పదివేల నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల నుంచి గౌరెల్లి వరకు దశల వారీగా అమలు చేస్తూ వెళ్తే బాధితుల సంఖ్య లక్షన్నరకు పైగానే ఉంటుందనేది స్పష్టమవుతున్నది. ఏడాది క్రితమే మూసీ మార్కింగ్ చేస్తూ, రెడ్, బ్లూ, బఫర్ జోన్ తో పాటు ఫుల్ రివర్ లెవెల్ పేర్లతో జియోగ్రాఫికల్ చిత్రాలను రూపొందించిన విషయం అందరికీ తెలిసిందే.

ఇళ్ళ కూల్చివేతను వ్యతిరేకిస్తున్నాం: బీజేపీ

మూసీ ప్రాజెక్టుపై బీజేపీకి వ్యతిరేకత లేదని, కాని పేదల ఇళ్ళను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు చెప్పారు. నది పునర్జీవనం, లేదా ప్రాజెక్టు పనులను తాము వ్యతిరేకించడ లేదని అన్నారు. గాంధీ సరోవర్ పేరుతో అక్కడ ఉంటున్నవారి ఇళ్లను కూల్చివేయడం సరైంది కాదని, మధు పార్క్ రిట్జ్ అపార్ట్ మెంట్, విఘ్నేశ్వర్ కాలనీలను కూల్చాల్సిన అవసరం లేదని చెప్పారు. గుజరాత్ సబర్మతి ప్రాజెక్టు పనులు చేపట్టే ముందుగా 4వేల నిరాశ్రయులకు ప్రత్యామ్నాయంగా ఇళ్ళు కట్టించిన తరువాతే పనులకు శ్రీకారం చుట్టారని ఆయన గుర్తు చేశారు.

బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ : బీఆర్ఎస్

మూసీ నది బ్యూటిఫికేషన్ కాదని లూటిషికేషన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి బుల్లోడజర్లకు అడ్డంగా పడుకుంటామని హెచ్చరించారు. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కాపాడతామని స్పష్టం చేశారు. రూ.16వేల కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని రేవంత్ రెడ్డి రూ.రూ.1.50 లక్షలకు పెంచారన్నారు. ఒక్క ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేయవచ్చని మాజీ సీఎం కేసీఆర్ నిరూపించారని కేటీఆర్‌ చెప్పారు. తమ ప్రభుత్వంలో ఒక్కరి ఇళ్లు కూడా కూల్చకుండా కొంత మేర మూసీ సుందరీకరణ చేశామన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇళ్లు బఫర్ జోన్ లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇళ్ళు దుర్గం చెరువులో ఉన్నాయని గుర్తు చేశారు.

Read Also |

Sonam Wangchuk | పదిరోజులపాటు భార్యతో కూడా మాట్లాడనీయలేదు..: సోనమ్‌ వాంగ్‌చుక్‌
Chiranjeevi | చిరంజీవి సినిమాలో విలన్స్‌గా రాజశేఖర్-మోహన్ బాబు .. శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌పై ఆసక్తికర టాక్
Mango Fruits | కిరాయికి మామిడి చెట్లు.. 90 కిలోల పండ్లు మీ సొంతం..!

Latest News