Aditya Realtors Controversy | సీఎం ‘శాఖ’లో అక్రమ నిర్మాణాల జోరు! ఆదిత్య రియల్టర్స్‌పై ఎవరికంత ప్రేమ?

సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలోనే అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. నార్సింగిలో ఆదిత్య బిల్డర్స్ మూసీ నది బఫర్ జోెన్ లో నిర్మిస్తున్న కట్టడాలే సాక్షి..

Aditya Realtors Controversy | సీఎం ‘శాఖ’లో అక్రమ నిర్మాణాల జోరు! ఆదిత్య రియల్టర్స్‌పై ఎవరికంత ప్రేమ?

హైదరాబాద్, అక్టోబర్‌ 2 (విధాత ప్రతినిధి):

Aditya Realtors Controversy |  మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఈ శాఖ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వరంలోనే ఉండటం చర్చనీయాంశమవుతున్నది. అందుకు పక్కా ఉదాహరణ మంచిరేవుల గ్రామంలోని ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీ సాగిస్తున్న భారీ బహుళ అంతస్తుల నిర్మాణం అంటున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై మీడియాలో నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే కాదు.. అంతర్గతంగా సమాచారాలు కూడా ప్రభుత్వానికి ఉంటాయనేది కాదనలేని వాస్తవం. మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో బాధ్యులైన ఆదిత్య రియల్టర్‌పై కఠిన చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. అక్రమ నిర్మాణం సక్రమం అనే విధంగా మంగళవారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్ఎండీఏ) ఒక పత్రికా ప్రకటన ఇచ్చి బాధ్యతల నుంచి తప్పించుకే ప్రయత్నం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పు ప్రకారమే నిలిపివేసిన అనుమతులను పునరుద్ధరించామని బుకాయిస్తున్నహెచ్‌ఎండీఏ.. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం, హక్కు ఉన్నా వెళ్లకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హెఎండీఎకే ఎవరి నుంచైనా ఒత్తిళ్లు ఉన్నాయా? అనే సందేహాలూ వస్తున్నాయి. ఇంకో విషయం ఏమంటే హెచ్ఎండీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఇదీ ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీ బాగోతం

రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలోని సర్వే నంబర్లు 476/ఏఏ1, 476/ఏఏ2 లో ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీకి 9.19 ఎకరాల భూమి ఉంది. ఇది నార్సింగి పోలీసు స్టేషన్ ఎదురుగా, ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవతల సర్వీసు రోడ్డును ఆనుకుని ఉంది. ఈ భూమిలో 38 అంతస్తుల బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీ 2022 మే 12న హెచ్ఎండీఏ కు దరఖాస్తు చేసుకున్నది. ఈ భూమిని ఆనుకుని మూసీ నది ఉన్నట్లు గుర్తించి స్పష్టత అడగ్గా, రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ జారీ చేసిన ఎన్వోసీ (2021 అక్టోబర్ 8న) సమర్పించారు. ఈ డాక్యుమెంట్లను పరిశీలించిన హెచ్ఎండీఏ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కమిటీ నిర్మాణాల అనుమతికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదిత్య రియల్టర్ నిర్ణీత ఫీజు చెల్లించగా, 2022 ఆగస్టు 2022 న అనుమతులు జారీ చేసింది. ఇరిగేషన్ ఎన్వోసీ జారీ చేసిన సమయం, అనుమతులు మంజూరు చేసిన సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అప్పుడు మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.

బఫర్‌ జోన్‌ ఆక్రమించి రిటైనింగ్‌ వాల్‌

హెచ్ఎండీఏ, రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్, స్థానిక రెవెన్యూ అధికారులు 2023 జూలై 3న సంయుక్త తనిఖీలు నిర్వహించగా.. మూసీ బఫర్ జోన్ ఆక్రమించి రిటైనింగ్ వాల్ నిర్మించినట్లు వెల్లడైంది. 2023 ఆగస్టు 2న హెచ్ఎండీఏ షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఆదిత్య కేడియా వివరణ సమర్పించింది. వివరణ సంతృప్తిక‌రంగా లేకపోవడంతో 2023 ఆగస్టు 18న భవన నిర్మాణ అనుమతులు రద్ధు చేసింది. అనుమతులు రద్ధు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆదిత్య కంపెనీ హైకోర్టుకు వెళ్లగా, మరోసారి సంయుక్త తనిఖీ నిర్వహించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోర్టు ఉత్తర్వులను అనుసరించి 2024 ఫిబ్రవరి 26న సంయుక్త తనిఖీలో రిటైనింగ్ వాల్ కూల్చినట్లు కన్పించింది. దీని తరువాత అనుమతులు పునరుద్ధరించాలని 2024 మార్చి 1న హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో అనుమతులు పునరుద్ధరించాల్సిన అనివార్యత ఏర్పడిందని హెచ్ఎండీఏ తన ప్రకటనలో పేర్కొన్నది. 2024 జూన్ 20న ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీకి అనుమతి పునరుద్ధరిస్తూ హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది.

హెచ్ఎండీఏ వాదన సరైందేనా?

ఈ అక్రమ నిర్మాణంపై నాలుగైదు రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నా స్పందించని హెచ్ఎండీఏ, ఎవరి ఆదేశం మేరకు ఆఘమేఘాల మీద వివరణ విడుదల చేసిందనే అంశం చర్చనీయాంశంగా మారింది. తన వివరణలో ఎక్కడా నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు విషయం, ఎఫ్ఐఆర్ అయిన సంగతి, అత్తాపూర్ 13వ మున్సిప్ మెజిస్ట్రేట్ కోర్టులో నార్సింగి పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సమాచారం కనిపించకుండా జాగ్రత్త పడింది. నార్సింగి పోలీసు స్టేషన్ లో ఏ అంశాల మీద ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? అనేది ఎక్కడా వివరించలేదు. భూమి హద్దులు తొలగించారని నార్సింగ్ పోలీసులు చార్జ్‌షీట్‌లో తెలిపారు. బఫర్ జోన్ ఉంటే మట్టి పోయద్దు, ఎత్తు పెంచవద్దనేది నిబంధనలు చెబుతున్నాయని కోర్టుకు తెలిపారు. అత్తాపూర్ కోర్టు కేసు ఏమైంది? ఏ వాదనలు విన్పించింది? మాత్రం పేర్కొనలేదు. అనుమతులు పునరుద్ధరించాలని 2024 మార్చి 1న హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు చెప్పింది. తీర్పు వచ్చిన తరువాతే అనుమతులు పునరుద్ధరించామని చెబుతున్నది. ఈ తీర్పును సుప్రీంకోర్టు లో సవాల్ చేయకుండా హెచ్ఎండీఏ ఎందుకు మౌనంగా ఉంది? ఎవరి ఆదేశంతోనే ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీకి అనుకూలంగా ఉంది? అనే ప్రశ్నలకు హెచ్‌ఎండీఏ సమాధానం చెప్పాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నీటి పారుదల శాఖతోనే ఇదంతా!

ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు రంగారెడ్డి జిల్లాలో నీటి పారుదల శాఖ ఇంజినీర్లు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్వోసీ) మూలంగా చెరువులు, కుంటలు, మూసీ పరివాహక ప్రాంతాలు బిల్డర్ల చేతుల్లోకి వెళ్లిపోయాయనే వాదనలు ఉన్నాయి. ఎన్వీసీల ను చూపించి వేల కోట్ల రూపాయలు విలువైన నీటి వనరులను రియల్టర్లు చెరబట్టి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఇదే కాకుండా మహేశ్వరం మండలం మంకాల్ గ్రామంలో కొత్తకుంట చెరువులో ఎఫ్.టి.ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు ఎన్వోసీ ఇచ్చారు. కొత్తకుంట చెరువు సర్వే నెంబర్ 776 లో 15.13 ఎకరాలు ఉండగా, 12.32 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా రియల్టర్ కు ఎన్వోసీ జారీ చేశారు. ఈ ఎన్వోసీ పై అనుమానం వచ్చి హైడ్రా, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తనిఖీ చేయగా ఎఫ్.టీ.ఎల్ పరిధి 8 ఎకరాల్లో ఉన్నట్లు వెల్లడి కావడంతో కంగు తిన్నారు. ఇంకో విచిత్రమేమంటే రియల్టర్ నీటి పారుదల శాఖ ఎస్ఈ, డివిజన్ 1 ఈఈ కార్యాలయాలకు దరఖాస్తు చేయకుండానే ఎన్వోసీ జారీ కావడం దారుణం. ఇంకో మతలు ఏంటంటే ఇద్దరు అధికారులు చెరొకటి చొప్పున ఇచ్చారు. తొలుత ఈఈ బన్సీలాల్ జారీ చేయగా, ఆ తరువాత సీఈ ధర్మా సైతం మరో ఎన్వోసీ ఇచ్చారంటే ఎంతగా బరితెగించారో అర్థమవుతోందని పర్యావరణ కార్యకర్తలు అంటున్నారు. పుప్పాలగూడ ఇబ్రహీం చెరువు, షేక్ పేట మల్కం చెరువును కలుపుతూ పందెన వాగు నాలా ఉంది. పుప్పాలగూడ సర్వే నెంబర్ 144, 146 లో 2.37 ఎకరాలు వాగు నాలా 2021 నుంచి కబ్జాకు గురవుతోంది. ఈ స్థలంలో పలువురికి ఎన్వోసీ జారీ చేశారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదిక ఇచ్చింది. ఆక్రమణలను స్థానిక రెవెన్యూ అధికారులు తొలగించడంలో నిర్లక్ష్యం ఉందని పేర్కొన్నది. ఇందులో నీటి పారుదల శాఖ, తహశీల్దార్, సర్వేయర్, హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్ర స్పష్టంగా ఉందని తేల్చింది. రెవెన్యూ శాఖకు చెందిన నలుగురు, నీటి పారుదల శాఖలో నలుగురు, హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారులపై చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

కళ్లు మూసుకున్న రంగారెడ్డి జిల్లా రెవెన్యూ!

మంచిరేవుల ఆదిత్య కేడియా రియల్టర్ కంపెనీ మూసీ పరీవాహక ప్రాంత కబ్జా విషయంలో కాని, మహేశ్వరం మండలం మంకాల్ గ్రామంలో కొత్తకుంట చెరువులో ఎఫ్.టి.ఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, పుప్పాలగూడ సర్వే నెంబర్ 144, 146 లో 2.37 ఎకరాలు వాగు నాలా కబ్జాలో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు, సర్వేయర్ల పాత్ర స్పష్టంగా కన్పిస్తున్నది. పై స్థాయిలో రాజకీయ ఒత్తిడి, రియల్టర్లు ఇచ్చే మూడుపులకు ఆశపడి చెరువులు, కుంటల్లో ప్రైవేటు నిర్మాణాలకు ఎన్వోసీలు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. చెరువులు, కుంటలు, నాలాల భూములు కబ్జా అవుతున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నా చర్యలు తీసుకోకపోగా, తమకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు.