Elevated Corrdors | హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ వరకు కొత్తగా ఫ్లైఓవర్లు
హైదరాబాద్‌లో కోర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేలా కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలకు HMDA ప్రణాళికలు. షేక్‌పేట–గండిపేట, బంజారాహిల్స్–గచ్చిబౌలి, ప్యారడైజ్–శామీర్‌పేట మార్గాలు కీలకం.
Hyderabad Elevated Corridors to Boost Core City–ORR Connectivity
- హైదరాబాద్ కోర్ సిటీ నుంచి ఔటర్‌కు కొత్త ఎలివేటెడ్ కారిడార్లు
- షేక్‌పేట–గండిపేట, బంజారాహిల్స్–గచ్చిబౌలి హైస్పీడ్ మార్గాలు
- ప్యారడైజ్–శామీర్‌పేట కారిడార్‌తో ఉత్తర తెలంగాణ అనుసంధానం
(విధాత తెలంగాణ స్టేట్ బ్యూరో) హైదరాబాద్:
Elevated Corrdors |హైదరాబాద్ మెట్రో నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నగర సరిహద్దులు రోజురోజుకీ వెనక్కి జరుగుతున్నాయి. కానీ ఆ విస్తరణకు తగినంత వేగంగా రహదారుల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందకపోవడంతో, నగరం నడిబొడ్డు నుండి ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) చేరుకోవడం వాహనదారులకు ప్రతిరోజూ ఒక పరీక్షలా మారింది. ఈ పరిస్థితికి దీర్ఘకాలిక పరిష్కారం చూపించేందుకు Hyderabad Metropolitan Development Authority (HMDA) ఎలివేటెడ్ కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై దృష్టి సారించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న మార్గాలన్నీ ప్రస్తుతం తీవ్రమైన ట్రాఫిక్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఔటర్‌పై వాహనాలు వేగంగా ప్రయాణించినా, అక్కడి నుంచి నగరంలోకి దిగగానే ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా నగరం మధ్య నుంచి ఔటర్‌కు వెళ్లాలంటే ప్రయాణ సమయం రెట్టింపవుతోంది. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నగరం నడిబొడ్డు నుంచి నేరుగా ORRకు చేరేలా కొత్త ఎలివేటెడ్ కారిడార్ల(ఫ్లైఓవర్లు)కు HMDA రూపకల్పన చేస్తోంది.
షేక్‌పేట–గండిపేట, బంజారాహిల్స్–గచ్చిబౌలి: ట్రాఫిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు

మెహదీపట్నం–టోలిచౌకి–షేక్‌పేట–రాయదుర్గం–గచ్చిబౌలి మార్గం ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కారిడార్లలో ఒకటి. ఈ మార్గంలో షేక్‌పేట ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ, రాయదుర్గం, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి వైపున ట్రాఫిక్ సమస్యలు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా షేక్‌పేట నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ కాలేజీ వరకు కొత్త రహదారి అభివృద్ధి ప్రతిపాదన ముందుకు వచ్చింది.
గండిపేట కాలువ వెంట ఇప్పటికే ఉన్న రహదారిని ఇరువైపులా 200 అడుగుల వెడల్పుకు విస్తరించి, భవిష్యత్తులో సుమారు 7 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు అనువుగా డిజైన్ చేస్తున్నారు. ఈ మార్గం అమల్లోకి వస్తే, పాత ముంబై హైవేపై ట్రాఫిక్ భారం గణనీయంగా తగ్గనుంది. మణికొండ, గండిపేట పరిసర ప్రాంతాలకు ఇది కీలక కనెక్టివిటీగా మారనుంది.
ఇదే సమయంలో ఐటీ ఉద్యోగుల ప్రయాణ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు ఆరు లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిలింనగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు పక్కనగా, టీ–హబ్ మీదుగా సాగే ఈ మార్గం దాదాపు 10 కిలోమీటర్లు పొడవుండనుంది. ఇందులో 6 నుంచి 7 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. సిగ్నల్స్, క్రాస్ ట్రాఫిక్ లేకుండా నేరుగా ORRకు చేరేలా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రూపొందిస్తున్నారు.
ప్యారడైజ్–శామీర్‌పేట కారిడార్‌తో ఉత్తర తెలంగాణకు ఊతం
సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట ORR జంక్షన్ వరకు నిర్మించనున్న 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ హైదరాబాద్ ట్రాఫిక్ సౌలభ్యానికి కీలక మలుపుగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును రూ.2,232 కోట్ల వ్యయంతో ఈపీసీ() మోడ్‌లో చేపడుతున్నారు. ఇందులో భాగంగా 11.65 కిలోమీటర్ల ఆరు లైన్ల ఫ్లైఓవర్, 6.52 కిలోమీటర్ల గ్రౌండ్ లెవెల్ రహదారి, అలాగే హకీంపేట వద్ద 450 మీటర్ల అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మించనున్నారు. 24 నెలల్లో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కారిడార్ పూర్తయితే కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, మెదక్, ఆదిలాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా నగరంలోకి వేగంగా ప్రవేశించగలుగుతాయి. ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఇంధన వినియోగం తగ్గి వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే మణికొండ, గండిపేట, శామీర్‌పేట పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో రియల్ ఎస్టేట్, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.
మొత్తంగా చూస్తే, ఈ ఎలివేటెడ్ కారిడార్లు హైదరాబాద్‌ను కేవలం ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తం చేయడమే కాకుండా, నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలున్న మెట్రోగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగుగా మారనున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram