మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడా..? ప్రజల ముందు పెట్టు: హరీశ్ రావు

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజల ముందుంచాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే ఇళ్ల కూల్చివేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడా..? ప్రజల ముందు పెట్టు: హరీశ్ రావు

విధాత, హైదరాబాద్: మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్ ప్రిపేర్ అయిందా? ఉంటే ప్రజల ముందు పెట్టు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఒకవేళ డీపీఆర్ ప్రిపేర్ అవ్వకపోతే, ప్రజల ఇళ్లు ఎందుకు కూలగొడుతున్నావని ప్రశ్నించారు. డీపీఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుందని రేవంత్ రెడ్డి మొన్న జనవరిలో జరిగిన అసెంబ్లీలో చెప్పారని, డీపీఆర్ రాకుండా 10,017 ఇళ్లు కూలుస్తానని ప్రజలకు నోటీసులు ఎలా ఇస్తావు? అని నిలదీశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి 8 సూటి ప్రశ్నలు వేశారు.

అసెంబ్లీ వేదికగా జనవరిలో సీఎం ఇచ్చిన సమాధానం ప్రకారం, హిమాయత్ సాగర్ నుంచి బాపూ ఘాట్ వరకు అధ్యయనం చేసి డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది అన్నారు. మరి డీపీఆరే రాకుండా పేదలకు ఎలా నోటీసులు ఇచ్చావని? ఎందుకు పేదల ఇండ్లు కూలగొడుతున్నావు? 10,017 ఇండ్లు కూల్చుతమని గెజిట్ ఎట్లా ఇచ్చినవు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. అసలు మీరు చేస్తున్నది మూసీ నది ప్రక్షాళననా? మూసీ సుందరీకరణనా? అసలు ఏం చేస్తున్నావు సమాధానం చెప్పు? అని డిమాండ్ చేశారు. అసలు బఫర్ ఎంత? ఒక ప్రభుత్వం 9 మీటర్లు, మరొక ప్రభుత్వం 30 మీటర్లు? ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 మీటర్లు అంటున్నాడు. అసలు బఫర్ ఎలా నిర్ణయించారు. ఉంటే స్టడీ బయటపెట్టండి.. అసలు మూసీ నుండి ఎలా కొలుస్తారు? అని ప్రశ్నించారు.

ఏదైనా ప్రాజెక్టు చేయాలంటే కనీసం వంద ఏళ్ల డేటా తీసుకొని చేస్తాం. హైడ్రాలజికల్ లేదా ఫ్లడ్ వాటర్ స్టడీ చేసారా? చేస్తే బయటపెట్టండని డిమాండ్ చేశారు. జనవరిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఏడీబీ లోన్ రూ. 4,100 కోట్లు మూసీకి ఇవ్వడానికి ఒప్పుకున్నది, మంజూరు అయ్యింది అని చెప్పారు. కానీ ఏడీబీ డిసెంబర్ 15, 2025 లో ఏమన్నది ఇంకా డీపీఆర్ మాకు సమర్పించలేదు, మా పద్దతి పాటిస్తేనే రుణం ఇస్తామని చెప్పింది. జనవరి 23, 2026 నాడు ఏం అన్నది.. మాకు డీపీఆర్ రాలేదు, మేం లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. నిన్నగాక మొన్న మార్చి 11 నాడు ఇచ్చిన లేఖలో.. మేం ఇంకా లోన్ సాంక్షన్ చేయలేదు అని చెప్పింది. ఇదీ వాస్తవం. మరి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం చెప్పాడని ఆరోపించారు.

ఇలా అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎలా నమ్ముతారు? పవిత్రమైన శాసనసభనే తప్పుదోవ పట్టించిండు రేవంత్ రెడ్డి. లోన్ మంజూరు అయ్యిందా లేదా? అసెంబ్లీని తప్పుదోవ పట్టించినవా స్పష్టం చేయి.. లేదంటే అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ పెడతాం అని హరీశ్ రావు తెలిపారు. ఇప్పటికే చాదర్‌ఘాట్‌లో మూసీ ప్రాజెక్ట్ కోసం 300 ఇళ్లు కూల్చారు. యూపీఏనే తెచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నడు. పరిహారం ఇవ్వకుండా కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లల్లకు పంపినావని గుర్తు చేశారు.

భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులలో ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పండి? ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే ఏం చేయలేదు. నువ్వు చేస్తవని ప్రజలు ఎట్ల నమ్ముతారు? మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాసులు నిన్ను ఎట్ల నమ్ముతారు? మాట తప్పని నైజం కేసీఆర్ సొంతమైతే… మాట తప్పడమే రేవంత్ నైజం అని పేరు తెచ్చుకున్నడాని విమర్శించారు.

మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా అన్నావు.. మధు పార్క్ రిడ్జ్ ఒక్కటే కాదు కదా? మూసీ వెంట మొత్తం 46 కాలనీలు ఉన్నాయి. పది వేల ఇండ్లు కూలగొడుతా అంటున్నావు. వీళ్లకు కూడా అదే పద్దతిలో స్థలం కేటాయిస్తవా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బ్యాంకుల్లో నిధులు జమ చేస్తవా? పదివేల మందికి ఇదే తీరుగా ఇళ్లు కట్టిస్తవా? వారి ఉపాధికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాదు, మెట్రో రైల్వే స్టేషన్, బస్టాండ్లు ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, ప్రభుత్వ ఆస్తులు ఉన్నయి ఇవన్నీ కూల్చుతావా? నీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేయాలని హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

రైతు భరోసా, ఫీజు రీయంబర్స్ మెంట్, పెన్షన్లు వంటి వాటికి, ఆరు గ్యారంటీలు, 420హామీలకు డబ్బులే లేవంటున్న రేవంత్ సర్కార్ రూ.1.50లక్షల కోట్లతో మూసీ సుందరీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ తో క్షిపణులు, డ్రోన్ లో యుద్దం చేస్తూ ఇళ్లు కూల్చుతుంటే..రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల ఇళ్లపై బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని హరీశ్ రావు దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి :

VK Sasikala New Party | తమిళనాడులో శశికళ కొత్త పార్టీ ప్రారంభం
Allu Cinemas | వాల్ ఆఫ్ ఫేమ్‌పై సోషల్ మీడియాలో చర్చ .. బ‌న్నీతో సినిమా చేసిన ద‌ర్శ‌కుల ఫొటోలు మాత్ర‌మేనా…?