డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని అధికారులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది(Petitions dismissed). ఏపీ కేడర్‌కు కేటాయించిన అధికారులు వెంటనే ఆక్కడ రిపోర్టు చేయాలని ఆదేశించింది. క్యాట్(CAT) ఆదేశాలను ఉన్నత నాయస్థానం సమర్థించింది.
డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ల(House motion petitions)పై హైకోర్టు విచారణ జరిపింది. ఐఏఎస్ అధికారులతో పాటు డీవోపీటీ తరఫున వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. అంతకు ముందు అధికారుల పిటిషన్లపై అధికారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని, పదేళ్ల అనుభవాన్ని పరిగణించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదని వాదించారు.
ట్రైబ్యునల్‌లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోరారు. అలాగే, ఐఏఎస్‌లను 15 రోజులు(Relief for 15 days) రిలీవ్ చేయొద్దని రెండు రాష్ట్రాలూ కోరాయి. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన లేఖలను సైతం హైకోర్టుకు ఐఏఎస్‌లు సమర్పించారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్(ASG) నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఉద్యోగులు ఎక్కడ పని చేయాలో కోర్టులు నిర్ణయించవద్దని.. క్యాట్ స్టే ఇవ్వకపోవడమనే నిర్ణయం సబబైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. డీవోపీటీ నిర్ణయంపై పూర్తి వివరాలతో క్యాట్‌లో కౌంటర్ దాఖలు చేస్తామని, అధికారుల పిటిషన్లు కొట్టివేయాలని ఏఎస్‌జీ కోరారు. కేంద్రం వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తామని, ముందు కేటాయించిన రాష్ట్రాల్లో విధుల్లో చేరాలని ధర్మాసనం అభిప్రాయపడింది. కనీసం 15 రోజుల పాటు రిలీవ్ చేయొద్దన్న విజ్ఞప్తిని సైతం ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ముందుగా అధికారులు తమకు కేటాయించిన రాష్ట్రంలో రిపోర్టు చేయాలని, సమస్యలేమైనా ఉంటే తర్వాత వింటామని స్పష్టం చేసింది. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం, ఐఏఎస్ అధికారుల పిటిషన్లను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Tags: