భారత కమ్యూనిస్టు ఉద్యమం పై రెండో గ్రేట్ డిబేట్

మావోయిస్టు ఉద్యమంపై సమగ్ర సమీక్ష అవసరమని మాజీ నేత ఫినిక్స్ తెలిపారు. సాయుధ పోరాట మార్గాన్ని వదిలేస్తున్నామని, రెండో గ్రేట్ డిబేట్ అవసరమని పేర్కొన్నారు.

విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఐదు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం పై నిజాయితీతో కూడిన సమీక్ష అవసరమని, తాము సాయుధపోరాట మార్గాన్ని ఎందుకు వదిలివేస్తున్నామో? ప్రస్తుత పరిస్థితునుల అంచనా వేయడంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వెనుకబడిదంటూ ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ఒరిస్సా కార్యదర్శి ముప్పిడి సాంబయ్య అలియస్ వికాస్ అలియాస్ ఫినిక్స్​ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ ఉద్యమం పై గ్రేట్ డిబేట్ జరుపాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ప్రతిపాదనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపెల్లి వాసుదేవరావులు ఒక వైపు తిపిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి తదితరులు మరో వైపు ఉన్నట్లుగా ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముప్పిడి సాంబయ్య తన అభిప్రాయాలను బహిర్గతం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజా పరిస్థితుల పై ఫినిక్స్ స్పందన ఆయన మాటల్లోనే ఈ విధంగా ఉంది.
గత ఏడాది అక్టోబర్లో సోను దాద (మల్లోజుల వేణుగోపాల్) బ్యాచ్, సతీష్ బ్యాచ్ (తక్కెళ్ళపెల్లి వాసుదేవరావు ) ప్రభుత్వం ముందు ఆయుధాలు దించిన విషయం అర్దమయింది. అది అనివార్యమైన పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయంగా అర్థం చేసుకున్నాం.అయితే వ్యక్తులుగా, గుంపులుగా పోవడం కాకండా మొత్తం పార్టీ గానే ఆ నిర్ణయం తీసుకుంటే సరిగా వుంటుందనీ, అలాంటి ప్రయత్నాలేవో చేస్తారనీ మొత్తం సిసి పేరుతోనే ఆహ్వానిస్తారనీ (ఉక్కు క్రమశిక్షణ గల కార్యకర్తలుగా) మేం ఎదిరి చూస్తూ వున్నాం.

పార్టీగా నిర్ణయం తీసుకుంటారని వేచిచూశాం

వ్యక్తులుగా, గ్రూపులుగా పోవడం విప్లవ శిబిరాన్ని చాలానెగెటివ్ గా ప్రభావం చేస్తుందనే భావనతోనే ఎన్ని ప్రమాదాలు, కష్టాలు ఉన్నప్పటికీ చావుకు తెగించి సంవత్సరం పైన రెండు నెలలు కగార్ బతుకు కొనసాగించాం.తృటిలో తప్పుకున్న ఘటనలు పదుల సంఖ్యలో జరిగాయి. చివరికీ 2026 ఫిబ్రవరి అయిపోవచ్చినా అధికారికంగా సిసి (కేంద్ర కమిటీ) నుండి అలాంటి చొరవ కనిపించలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, ముందు చూపు లేని సిసి వైఖరి మూలంగా అనేకమంది విలువైన కామ్రేడ్లను కోల్పోయి చివరికీ ఘోర అవమానకరమైన ఓటమి పాలయ్యాం. 2013 నాటికి భారత దేశ వ్యాప్త ఉద్యమం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నదని సమీక్షించిన సిసి 2018 నాటికి దేశ వ్యాప్త ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైందని సమీక్షించింది. అప్పుడే లోతుగా ఆలోచించి తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రకటించి పార్టీని లీగలైజ్ చేసి వుంటే అనేక మంది అద్బుతమైన పార్టీ కార్యకర్తల్ని రక్షించుకుని ప్రజల మధ్య నిజాయితీతో పని చేసే ఒక విశాలమైన సమూహం పార్టీ చేతిలో వుండేది.

ముందు చూపులేని సీసీ

ముందు చూపు లేని సిసి అలా చేయలేక పోయింది. పీకల దాకా స్వీయాత్మక వాదంలో మునిగి వున్న సిసి ఆచరణకు పొసగని పథకాలతో, ఊహాలోకాల్లో తేలియాడింది. లాగింగ్ బిహైండ్ అనే మొండి రోగానికి గురై వున్న సిసి చెర్ల నీళ్లన్ని చెరువెనుక బడ్డంక పార, పలుగులతో బయలు దేరింది. కింది నుండి కేడర్లు లేవనెత్తే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేక పోగా అలాంటి నిజాయితీ గల కేడర్లను శీత కన్నుతో చూసింది. అవిశ్వాస పాత్రులుగా భావించింది. తన గొంతులో గొంతు కలిపే వాళ్లను నెత్తినెత్తుకున్నది.

చివరికి సాయుధ పోరాట మార్గం వదిలేశాం

చివరి వరకు చూసి ఆఖరి డబ్బాగా బయటికి రావాలనే క్రమ శిక్షణకు కట్టుబడి అనేక శత్రువు చక్రబంధాల మద్య, చావు బతుకుల మధ్య తెగించి మార్చి 1 తారీకు వరకు నిలబడ్డాం. ఇదేం మామూలు విషయం కాదు. ఒడ్డున కూర్చుని వీక్షించే వాళ్లకు ఇదంతా అర్థం కాదు. కగార్ చివరి నెలలో సిసి ముఖ్య నాయకత్వమంతా బయటికి వెళ్లాకనే నేను చివరి డబ్బాగా అనివార్యంగా రావాల్సి వచ్చింది. అమరుడవడమా? బయటికి రావడమా? అనే రెండే మార్గాలు మిగిలి ఉన్నప్పుడు, ఐదు దశాబ్దాల ఉద్యమం రెండేండ్లలో తుడిచి పెట్టుకు పోతున్నప్పుడు ఇంత జరిగాక, ఈ ఓటమికి మూలాలు ఎక్కడున్నాయో? నిజాయితీగా సమీక్షించాల్సిన అవసరం భావి తరాల కోసమైనా చేయాల్సి ఉన్నది.ఈ పని బయట ఉన్నవాళ్లు సరిగ్గా చేయలేరు.వాళ్ల జ్ఞానానికి అనేక పరిమితులుంటాయి. కాబట్టి నాలుగు దశాబ్దాల లోపలి ఉద్యమ ప్రత్యక్ష అనుభవం గల నాయకత్వం మిగిలి ఉండడం తప్పని సరి అవసరం.అందులో భాగమే నేను బయటికి రావాలనే నిర్ణయం

నిరాశ వద్దు గ్రేట్ డిబేట్ కు సిద్ధమవుదాం

కొంతమంది “వైట్ కాలర్ “విప్లవకారులకు ఇవన్నీ బుర్ర కెక్కుతున్నట్లు లేదు. వాళ్ల రాతలు చూస్తుంటే ఒడ్డున కూసోని మాట్లాడే వాళ్లకు నీటి లోతేమిటో తెలియదు అన్నట్లు ఉన్నది. నీళ్లల్లో మునిగినోడు ఏం చెపుతున్నడు? ఎందుకు చెపుతున్నడు అనే సంయమనం పాటించకుండా చాలా తెల్లకాగితాల్ని కరాబు చేస్తున్నట్లు బయటికొచ్చాక అర్థమవుతున్నది. విషయాల్ని లోతుగా పరిశీలించకుండానే పైపై పరిశీలనా, అరకొర సమాచారంపై ఆధారపడి రాసే రాతల ద్వారా ప్రజలకు విప్లవ శిబిరంపై ఉన్న విశ్వాసాన్ని బలహీనపర్చేందుకే అవి ఉపయోగ పడుతున్నాయి.ఇది మన అపరిపక్వతకు చిహ్నమే తప్ప మరేం కాదు. సంయమనంతో “నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించని”అన్న మావో స్పూర్తితో ఓపికగా, లోతుగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుందాం. సంభాషించుకుందాం.

(ఇంటర్నెట్ తో పొంచి వున్న ప్రమాదాల మూలంగా కుల్హాడీ ఘాట్ ఘటన తర్వాత నుండి బయటికి వచ్చేంత వరకు కేవలం రేడియో సమాచారంపైనే ఆధారపడడం మూలంగా సోనుదా, సతీష్ వాళ్లు బయటకొచ్చి మీడియా ముందు ఏం చెప్పారు? ఎవరెవరు బయటికొచ్చారు? ఎవరు లోపల మిగిలారు? ఇలాంటి విషయాలేవీ నాకు తెలియదు)

ఈ అవమానకరమైన ఓటమి నుండి నిరాశ చెందకుండా భావితరాల కోసం నిజమైన గుణపాఠాల్ని తీద్దాం.అది నిర్మాణ సంక్షోభమా? సిద్దాంత సంక్షోభమా?దాన్ని తేల్చుకోవడానికి అవసరమైన అన్ని విషయాలపై ఎలాంటి బేషజాలకు పోకుండా బృహత్తర చర్చకు సిద్దమవుదాం. ఇది రెండో గ్రేట్ డిబేట్ కొనసాగించాల్సిన సందర్బం. భారత విప్లవోద్యమానికి, కమ్యూనిస్టు పార్టీకి వందేళ్లు నిండిన సందర్బంగా వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని పునర్ మూల్యాంకణం చేసి భావి తరాలకు సరైన మార్గాన్ని చూపాల్సిన భాధ్యత నిజాయితీ గల కమ్యూనిస్టులందరిపై వుందని మావోయిస్టు పార్టీ ఒరిస్సా మాజీ సెక్రెటరీ ఫినిక్స్ ఈ నెల మొదటి వారంలో రాసిన రిపోర్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

Gold, Silver Price Drop | భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!

Latest News