Revanth Reddy : రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఉగాది తీపి కబురు!

ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం, ఈ నెల 22న రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు.

విధాత, హైదరాబాద్ : ఉగాది పర్వదినం రోజున సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతన్నలకు శుభవార్తలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకలలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి త్వరలోనే పరిష్కారం చూపించబోతున్నామని వెల్లడించారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటిస్తూ.. “ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అండగా దాన్ని తరిమేసి భూ భారతితో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నాం అని తెలిపారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణం అన్నారు.

పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని స్పష్టం చేశారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది అని గుర్తు చేశారు. ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందించింది అని వెల్లడించారు.

పండించిన పంటలపై రైతుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలుగా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులుదేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొందిస్తాయి అని రేవంత్ రెడ్డి అన్నారు. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుంది అని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. వేడుక సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు పంచాంగ శ్రవణం చేశారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం

Latest News