పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి ఎత్తుకుపోయినట్లు అనేది పాత సామెత. కానీ ఇప్పుడు ఓ పిల్లి కోసం జరుగుతున్న పోట్లాట అంతకుమించి అనేలా ఉంది. అలాంటి ఓ సమస్య తాజాగా నల్గొండ జిల్లా పోలీసులకు ఓ వింత కేసు తలనొప్పిగా మారింది. తన పిల్లి మిస్సయ్యిందంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.సీన్ కట్ చేస్తే తన ఇంటి పక్కన వారే కిడ్నాప్ చేశారంటూ పిటీషన్ లో పేర్కొంది. ఈ పంచాయితీ కాస్తా జిల్లా పోలీస్ బాస్ దగ్గరకు వెళ్లింది.పిల్లి నాదంటే నాదనే వాదనలు వినిపిస్తున్నాయి రెండు కుటుంబాలు.దాంతో పిల్లి ఎవరిదనే తేల్చే పనిలో పడ్డారు పోలీసులు.
నల్గొండ పట్టణంలోని రేహమత్ నగర్ కు చెందిన పుష్పలత నెల రోజుల పిల్లిని తెచ్చుకుని పెచ్చుకుంటుంది. దానికి పప్పీ అనే పేరు పెట్టింది. మూడేళ్లుగా దానిని కంటికి రెప్పలా కాపడుకుంటూ వస్తూ చాలా అత్మీయతను పెంచుకుంది. గతేడాది జూన్ లో పిల్లి కనబడకుండా పోవడంతో ఓనర్ పుష్పలత సమీపంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పిల్లి తప్పిపోయినట్లు కేసు పెట్టింది.
తీరా సీన్ కట్ చేస్తే కొద్ది రోజులకు అదే గల్లీలో ఆ పిల్లి ప్రత్యక్షమవడంతో షాక్ అయింది. ఆష్రఫ్ అనే వ్యక్తి తన పిల్లిని గుర్తు పట్టకుండా రంగు వేశారని ‘నా పిల్లి ఎలా ఉంటుందో నాకు బాగా గుర్తు. పిల్లిని ఎత్తుకెళ్లడమే కాక రంగులేసి మోసం చేస్తారా? దానికి స్నానం చేయిస్తే ఆ రంగంతా పోయింది’ ఆరోపిస్తూ ఈనెల 15న నల్లగొండ పుష్పలత పోలీసులకు తెలిపింది. అయితే ఆ పిల్లి మాదేనంటూ అష్రఫ్ కుటుంబం వాదిస్తుంది. ఓ వ్యక్తి దగ్గర రూ. 3,500 కొనుగోలు చేశామని వివరించారు. ఈ క్రమంలోపోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదంటూ గురువారం జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసింది పుష్పలత .
దాంతో పోలీస్ బాస్ ఆదేశాల మేరకు పిల్లి హెయిర్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లక్డీకాపూల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ వేగవంతంగా జరుగుతుంది. నిజంగా పుష్పలత వాదిస్తున్నట్టు పిల్లికి రంగు పూశారా.. అష్రఫ్ చెబుతున్నట్టు అది పుట్టుకతో ఉన్న కలరేనా? అన్నదే ల్యాబ్ రిపోర్ట్ లో తేలనుంది. ప్రస్తుతం సదరు పిల్లి అష్రఫ్ పర్యవేక్షణలోనే ఉంది. అయితే.. ల్యాబ్ రిజల్ట్ లో విజయం తనదేనని పుష్పలత అంటుండగా.. అస్సలు తగ్గేదేలే అంటుంది అశ్రఫ్ కుటుంబం. చూడాలి మరి వీరిలో నెగ్గేదెవరో తగ్గేదెవరో. మొత్తానికి పిల్లి లొల్లి మాత్రం పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది.