Sonam Wangchuk | తనను కట్టేసి, జైల్లో పడేశారని, దాదాపు పదిరోజులపాటు తన కుటుంబ సభ్యులతో, లీగల్ టీమ్‌తో మాట్లాడే వీలు కల్పించలేదని లద్దాఖ్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ చెప్పారు. మంగళవారం (మార్చి 17, 2026) ఆయన తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. ఆ వివరాలను పలు వెబ్‌సైట్‌లు పబ్లిష్ చేశాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని, ఈ ప్రాంతాన్ని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగిన సోనమ్ వాంగ్‌చుక్‌ను గత ఏడాది జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద అరెస్టు చేశారు. జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి వాంగ్‌చుక్‌ను శనివారం (మార్చి 14, 2026) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయనపై కేంద్ర హోం శాఖ నాసా చట్టాన్ని ఎత్తివేయడంతో 170 రోజుల నిర్బంధం అనంతరం ఆయన బయటకువచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం, ప్రజలు పట్టువిడుపులు ప్రదర్శించాలని అన్నారు. ‘చర్చలు ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో ఉండాలి. ఇరు పక్షాలూ సర్దుకుపోయే ధోరణితో ఉండాలి’ అని ఆయన చెప్పారు. అదే సమయంలో అనవసరంగా చర్చలను సాగదీసినట్టయితే అర్థవంతమైన సంభాషణ దెబ్బతిటుందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వంతో కొనసాగే చర్చలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లద్దాఖ్ భవిష్యత్తు కోసం అర్థవంతమైన చర్చలను ప్రారంభించాలన్నదే తన ఉద్యమ కీలక ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వ వైఖరిని సానుకూల సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రాంతానికి, పర్యావరణానికి, పాలనకు లబ్ధి చేకూర్చేందుకు చర్చలు దోహదం చేస్తాయని చెప్పారు. నిజమైన విజయం అనేది వ్యక్తిగత విజయాలు కాకుండా.. ఉమ్మడి ప్రగతిపైనే ఆధారపడి ఉంటాయని అన్నారు. నమ్మకం, సహకారం ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన సోనమ్ వాంగ్‌చుక్… సుస్థిర పరిష్కారానికి నిరంతరాయ చర్చలు మార్గం సుగమం చేస్తాయని, నిర్ణయాల రూపకల్పన ప్రక్రియలో లద్ధాఖ్ ప్రజల గళం వినిపిచేలా, గౌరవించేలా చూస్తుందని అన్నారు.
ప్రధానాంశాలు రాష్ట్రప్రతిపత్తి, ఆరో షెడ్యూల్‌లో చేర్చడమేనన్న వాంగ్‌చుక్.. కేంద్రం స్పందిస్తే చర్చలకు తాను సిద్ధమని చెప్పారు. ఘర్షణపూరిత వైఖరికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ‘కోర్టులో విజయంపై మాకు నమ్మకం ఉంది. కానీ.. ఆ విజయం సరిపోదు. నేను అందరూ గెలవాలని కోరుకుంటాను’ అని తెలిపారు. తదుపరి చర్యలు తీసుకునే ముందు తాను లే అపెక్స్‌బాడీని, కార్గిల్ డెమోక్రటిక్ అలయెన్స్‌ను సంప్రదిస్తానని చెప్పారు.
