Ladakh Statehood Protest | రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ లో నిరసనలు ఉదృతం..లాఠీచార్జి

లద్దాఖ్‌లో రాష్ట్ర హోదా కోసం నిరసనలు తీవ్రం, లేహ్‌లో ఘర్షణలు, లాఠీచార్జి, నలుగురు మృతి, వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగింపు.

Ladakh  Statehood Protest | రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్ లో నిరసనలు ఉదృతం..లాఠీచార్జి

న్యూఢిల్లీ : రాష్ట్రహోదా డిమాండ్‌ చేస్తూ కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లో చేపట్టిన నిరసనలు బుధవారం ఉద్రిక్తతలకు దారితీశాయి. లేహ్ నగరంలో ఆందోళనకారులు పెద్ద ఎత్తు రోడ్లపైకి వచ్చారు. వారిని చెదరగొట్టేందుకు వచ్చిన పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యాలయానికి, సీఆర్ఫీఎఫ్ పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనలో నలుగురు మృతి చెందగా..71మంది గాయపడ్డారు. పోలీసులు ఆందోళన కారులపై లాఠీచార్జీ చేసి..బాష్పవాయువు ప్రయోగించారు. తాజా అల్లర్లతో కేంద్రం లడ్డాక్ లో భారీగా బలగాలను మోహరించింది. ఇక్కడ ఇలాంటి ఆందోళనలను చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

సోనమ్‌ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్షలు ఆందోళనలు ఉదృతం

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని ఎన్‌డీయే ప్రభుత్వం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటి నుంచి రాష్ట్రహోదా పునరుద్ధరణ కోసం డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు మూడేళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. రాష్ట్రహోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ రెండువారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌ కింద చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్ ప్రజల డిమాండ్లపై కేంద్రం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినా ఆశించిన ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 6న చర్చలకు రావాలని కేంద్రం ఆహ్వానించింది. ఈ సమయంలో ఆందోళనలు చోటుచేసుకోవడం గమనార్హం. రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలన్న డిమాండ్‌తో ఆందోళనకారులు ఉదయం లేహ్‌ వీధుల్లోకి వచ్చారు. మరోవైపు రాష్ట్ర హోదా ఆందోళనలు శాంతియుతంగా జరుగాలని వాంగ్ చుక్ పిలుపునిచ్చారు.