Rajinikanth | రజనీకాంత్ రాజకీయాలపై వివాదం.. టీవీకే నేత వ్యాఖ్యలకు సూపర్ స్టార్ కౌంటర్

Rajinikanth |  తమిళ సినీ దిగ్గజం రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి వివాదం చెలరేగింది. టీవీకే పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీయగా, ఈ అంశంపై రజనీకాంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Rajinikanth |  తమిళ సినీ దిగ్గజం రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై మరోసారి వివాదం చెలరేగింది. టీవీకే పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో చర్చకు దారితీయగా, ఈ అంశంపై రజనీకాంత్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా పుకార్లేనని స్పష్టం చేస్తూ, సరైన సమయంలో కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందని అన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించిన సమయంలో డీఎంకే పార్టీ ఆయనపై ఒత్తిడి తెచ్చిందని, బెదిరింపులు కూడా చేసినట్లు ఆరోపించారు. అయితే తాను రజనీకాంత్‌ను విమర్శించాలనే ఉద్దేశంతో ఇలా చెప్పలేదని, ఇలాంటి ఒత్తిళ్లకు తమ పార్టీ అధినేత విజయ్ మాత్రం తలొగ్గరని చెప్పడమే తన ఉద్దేశమని పేర్కొన్నారు.

ప్రెస్ నోట్ విడుద‌ల‌..

ఆదవ్ అర్జున్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. డీఎంకే నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయ లాభం కోసం టీవీకే నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో రజనీకాంత్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు.

ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఈ వివాదంపై స్పందిస్తూ ట్విట్టర్‌లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. టీవీకేలో ఉన్న ఒక నేత తనపై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని ఆయన పేర్కొన్నారు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు మరియు అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

స‌రైన స‌మ‌యంలో అన్నింటికి స‌మాధానం వ‌స్తుంది..

ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “కాలం మాట్లాడకపోవచ్చు కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రజనీకాంత్ స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో ‘రజనీ మక్కల్ మండ్రం’ పేరుతో పార్టీ ప్రారంభించబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ రాజకీయాల్లోకి రానని ప్రకటించారు.

రజనీకాంత్ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో అభిమానులను, రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఎందుకు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇప్పుడు టీవీకే నేత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ అదే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. నిజంగానే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రజనీకాంత్ ఇచ్చిన తాజా స్పందనతో ఈ వివాదం మరింత చర్చకు దారితీసింది.

Latest News