Site icon vidhaatha

మ‌హిళా జ‌డ్జికి లైంగిక వేధింపులు.. చ‌నిపోయేందుకు అనుమ‌తివ్వాల‌ని సీజేఐకి లేఖ‌

ల‌క్నో: సీనియ‌ర్ల నుంచి త‌న‌కు లైంగిక వేధింపులు వ‌స్తున్నాయ‌ని, తాను గౌర‌వ‌ప్ర‌దంగా చ‌నిపోయేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఓ మ‌హిళా జ‌డ్జి.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి రాసిన లేఖ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఈ లేఖ‌పై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ స్పందించారు. ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని సంబంధిత అధికారుల‌ను సీజేఐ ఆదేశించారు.


వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ మ‌హిళా జ‌డ్జి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాందా జిల్లాలో విధులు నిర్వ‌ర్తిస్తోంది. ఆ జిల్లాలో ప‌ని చేసే న్యాయ‌మూర్తి, ఆయ‌న అనుచ‌రుల నుంచి లైంగిక వేధింపులు వ‌స్తున్నాయి. గ‌త కొన్ని నెల‌ల నుంచి త‌న‌ను లైంగికంగా వేధిస్తున్నార‌ని, పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రి స‌మ‌యాల్లో జిల్లా న్యాయ‌మూర్తిని ఒంట‌రిగా క‌ల‌వాల‌ని వేధిస్తున్నార‌ని ఆ మ‌హిళా జ‌డ్జి త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఈ వేధింపుల‌పై గ‌తేడాది జులై నెల‌లో హైకోర్టు అంత‌ర్గ‌త ఫిర్యాదుల క‌మిటీ దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ, ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ఆమె వాపోయారు.


ఈ కేసులో సాక్షులు కూడా ఆ జిల్లా న్యాయ‌మూర్తి కింద ప‌ని చేసేవారే. అలాంటి సంద‌ర్భాల్లో ఆ న్యాయ‌మూర్తికి వ్య‌తిరేకంగా వారు సాక్ష్యం చెప్ప‌లేరు. కాబ‌ట్టి ద‌ర్యాప్తు పూర్త‌య్యే వ‌ర‌కు స‌ద‌రు న్యాయ‌మూర్తిని మ‌రో చోటుకు బ‌దిలీ చేయాల‌ని కోరుతూ భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశాను. కానీ ఆ పిటిష‌న్‌ను సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే నా ముందే కొట్టేశారు. ఈ క్ర‌మంలో ఏడాదిన్న‌ర కాలం నుంచి తాను ఒక జీవ‌చ్ఛ‌వంలా బ‌తుకుతున్నాను. కాబ‌ట్టి తాను బ‌తికుండి లాభం లేదు. గౌర‌వ‌ప్ర‌దంగా చ‌నిపోయేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బాధిత మ‌హిళా జ‌డ్జి త‌న లేఖ‌లో పేర్కొన్నారు.


ఈ లేఖ‌పై స్పందించిన సీజేఐ డీవై చంద్ర‌చూడ్ చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ అతుల్ ఎం కుర్హేక‌ర్‌ను ఆదేశించారు. దీనికి సంబంధించిన మొత్తం వివ‌రాల‌ను స‌మ‌ర్పించాల‌ని అల‌హాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌కు కుర్హేఖ‌ర్ లేఖ రాశారు.



Exit mobile version