Allahabad High Court | తనకు భర్త నుంచి భరణం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన భార్యకు కోర్టు దిమ్మతిరిగేలా తీర్పునిచ్చింది. సంపాదించలేని స్థితిలో ఉన్న భర్త నుంచి భరణం కోరడం సరికాదని, ఆమె పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుడైన వేద్ ప్రకాశ్ సింగ్.. సొంతంగా క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య వినీతతో గత కొన్నేండ్ల నుంచి గొడవలు ఉన్నాయి. గతేడాది వేద్ ప్రకాశ్ సింగ్ క్లినిక్‌కు వినీత తండ్రి, సోదరుడు చేరుకుని అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ప్రకాశ్ సింగ్ శరీరంలోనే ఓ బుల్లెట్ ఉండిపోయింది. ఆ బుల్లెట్‌ను తొలగిస్తే పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉండడంతో.. దాన్ని వైద్యులు తొలగించలేదు. ఈ క్రమంలో కూర్చోలేని స్థితిలో ఉన్న ప్రకాశ్ సింగ్.. తన విధులకు దూరంగా ఉంటున్నాడు.. డబ్బు సంపాదించలేకపోతున్నాడు.
ఇక తన భర్త నుంచి భరణం కావాలంటూ ఖుషి నగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో వినీత పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఫ్యామిలీ కోర్టు.. భర్త డబ్బు సంపాదించలేని స్థితిలో ఉన్నట్లు కోర్టు గుర్తించింది. అలాంటి పరిస్థితిలో ఉన్న భర్త నుంచి భరణం కోరడం సరికాదని కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో వినీత అలహాబాద్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది.
వినీత పిటిషన్ విషయంలో ఖుషి నగర్ ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మీకాంత్ శుక్లా మాట్లాడుతూ.. భారతీయ సమాజంలో ప్రతి మహిళ తన భర్త నుంచి సంపాదన కోరుకుంటుంది. కుటుంబ పోషణ కూడా పురుషుడిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ కేసులో వేద్ ప్రకాశ్ సింగ్‌పై వినీత కుటుంబ సభ్యులు దాడి చేసి.. పని చేసుకోలేని స్థితి కల్పించారు. మరి అతను డబ్బు ఎలా సంపాదించి.. భరణం ఇవ్వగలుగుతాడు. ప్రకాశ్ సింగ్ పని చేయలేని స్థితికి వినీతి సోదరుడు, తండ్రినే కారణమని కోర్టు గుర్తించింది. కాబట్టి ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు జస్టిస్ శుక్లా పేర్కొన్నారు.
భరణం అనేది భర్త సంపాదించే సామర్థ్యానికి ముడిపడి ఉంటుందనే విషయాన్ని ఎత్తి చూపేందుకు అలహాబాద్ హైకోర్టు 2015లో షమీమా ఫరూఖీ వర్సెస్ షాహిద్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.
