Allahabad High Court:
బాలిక వక్షాలను తాకినా, లేదా పైజామా బొందు తెంపినా, ఆమెను ఈడ్చుకు వచ్చినా అవి రేప్ లేదా రేప్‌కు ప్రయత్నం అభియోగాల పరిధిలోకి రావని అలహాబాద్ హైకోర్టు ఇటీవల ఒక తీర్పు చెప్పింది. అయితే.. ఈ చర్యలు దుందుడుకు లైంగిక దౌర్జన్యం కిందకు వస్తాయని తెలిపింది. బాలలపై లైంగిక దౌర్జన్యాల నిరోధక చట్టం (పోస్కో) కింద పవన్, ఆకాశ్ అనే ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ 376 (రేప్), పోస్కో చట్టంలోని సెక్షన్ 18 (నేరానికి పాల్పడే ప్రయత్నం) కింద అభియోగాల దాఖలుకు ట్రయల్ కోర్టు అంతకు ముందు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం సవరించింది. నిందితులను పోస్కో చట్టంలోని సెక్షన్ 354-బీ (దాడి చేయడం లేదా నేరపూరితంగా వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడం), సెక్షన్ 1, 10 (దుందుడుకు లైంగిక దౌర్జన్యం) కింద విచారించాలని హైకోర్టు ఆదేశించింది.
11, 12 ఏళ్ల మధ్య వయసున్న బాలిక వక్షాలను తాకారని వారిపై పోలీసులు కేసు పెట్టారు. నిందితుల్లో ఒకడైన ఆకాశ్.. సదరు బాలిక పైజామా తాడును తెంపి, ఒక కల్వర్టు కిందకు ఈడ్చుకుపోయేందుకు ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. తమపై రేప్ కేసు వర్తించదని, పోస్కో చట్టంలోని సెక్షన్ 354, 354-బీ ఇతర పోస్కో చట్టంలోని సెక్షన్లు వర్తిస్తాయని హైకోర్టును నిందితులు ఆశ్రయించారు.
అంతకు ముందు ట్రయల్ కోర్టు వారిద్దరు సదరు బాలిపై రేప్‌కు ప్రయత్నించారంటూ పోస్కో చట్టంలోని సెక్షన్ 376, పోస్కో చట్టంలోని సెక్షన్ 18 కింద అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు మాత్రం సాక్ష్యాధారాలను, మెటీరియల్‌ను పరీక్షించి, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఆధారాలు లేవని పేర్కొన్నది. ‘ఆమెను కల్వర్టు కిందకు ఈడ్చుకుపోయి, ఆమె పైజామా తాడును తెంపాడని ఆకాశ్‌పై నిర్దిష్ట ఆరోపణ. అయితే, ఆమెను వివస్త్రను చేసినట్టు లేదా నగ్నంగా మార్చినట్టు సాక్షులు కూడా చెప్పలేదు. ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించినట్టు కూడా ఆధారాలు లేవు’ అని హైకోర్టు పేర్కొన్నట్టు లైవ్‌లా తెలిపింది.