Site icon vidhaatha

Allahabad High Court | శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా కేసులో సివిల్‌ సూట్‌లను అనుమతించిన అలహాబాద్‌ హైకోర్టు

సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న ఈద్గా కమిటీ

ప్రయాగ్‌రాజ్‌ : మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా మసీదు వివాదం కేసులో హిందూ పక్షం దాఖలు చేసిన సివిల్‌ సూట్‌ విచారణకు యోగ్యమైనదని అలహాబాద్‌ హైకోర్టు గురువారం పేర్కొన్నది. శ్రీకృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా కేసులో పెండింగ్‌లో ఉన్న 18 కేసుల విచారణ యోగ్యతపై జస్టిస్‌ మయాంక్‌ కుమార్‌ జైన్‌ ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఈద్గా కమిటీ ప్రకటించింది. ఈ పిటిషన్లపై అలహాబాద్‌ హైకోర్టు సుదీర్ఘకాలంగా విచారణ జరుపుతున్నది. జూన్‌ నెలలో తీర్పును రిజర్వ్‌ చేసింది. షాహీ ఈద్గా మసీదు నిర్మాణాన్ని తొలగించాలని, ఆ భూమిని తమకు అప్పగించాలని, శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని పునర్నిర్మించాలని హిందూపక్షం దాఖలు చేసిన సివిల్‌ సూట్లు డిమాండ్‌ చేశాయి.

షాహీ ఈద్గా మసీదు మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటిది. కృష్ణ జన్మస్థానంలో నిర్మించిన ఆలయాన్ని ధ్వంసం చేసి, మసీదును నిర్మించారని హిందూపక్షం పిటిషన్లు పేర్కొంటున్నాయి. ఆ వివాదాస్పద స్థలంపై హిందువులకే హక్కు ఉన్నదని వాదిస్తున్నాయి. అయితే.. మరోవైపు శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్టుకు, షాహీ ఈద్గా కమిటీకి మధ్య ఎలాంటి వివాదం లేదని ముస్లిం పక్షం వాదిస్తున్నది. ఆలయ ట్రస్టుకు, మసీదు ట్రస్టుకు మధ్య 1968లో ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం.. శ్రీకృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాల భూమిని కేటాయించగా, షాహీ ఈద్గా మసీదుకు రెండున్నర ఎకరాల భూమిని ఇచ్చారు. ఫిర్యాదుదారుల చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తిన షాహీ ఈద్గా మసీదు ట్రస్టు.. వివాదాన్ని రేకెత్తించే పార్టీలతో జన్మభూమి ట్రస్ట్‌, ఈద్గా కమిటీకి ఎలాంటి సంబంధం, ఆందోళన లేదని తేల్చి చెబుతున్నది. ఈద్గా ప్రాంతం వక్ఫ్‌ ఆస్తి అని ముస్లిం పక్షం వాదిస్తున్నది. రైట్‌ టు వర్షిప్‌ యాక్ట్‌ ప్రకారం ప్రార్థనా స్థలాల్లో మార్పులు చేయడం సాధ్యం కాదని చెబుతున్నది. కానీ.. అది వక్ఫ్‌ ఆస్తి అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని హిందూ పక్షం చెబుతున్నది. షాహీ ఈద్గా మసీదు ఉన్న రెండున్నర ఎకరాల భూమి వాస్తవానికి శ్రీకృష్ణ ఆలయ గర్భగుడి అని వాదిస్తున్నది. ఈ భూమి ఈద్గాదే అనేందుకు వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవని చెబుతున్నది. శ్రీకృష్ణ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఈద్గా మసీదును నిర్మించారని పేర్కొంటున్నది. ఎలాంటి పత్రాలు లేకపోయినా అది వక్ఫ్‌ స్థలంగా చెప్పుకొంటున్నారని ఆరోపిస్తున్నది. అయితే.. 1968లో ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కుదిరిందని, 60 ఏళ్ల తర్వాత ఒప్పందం తప్పని చెప్పడం సరికాదని ముస్లిం పక్షం వాదిస్తున్నది. కనుక ఈ సివిల్‌ సూట్లు విచారణయోగ్యం కానివని పేర్కొంటున్నది. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం కూడా ఈ సూట్‌లు విచారణయోగ్యం కావని స్పష్టం చేస్తున్నది. 1947 ఆగస్ట్‌ 15 నాటికి ఉన్న ప్రార్థనా స్థలాల గుర్తింపు, స్వభావం యథాతథంగా కొనసాగుతాయని చట్టం చెబుతున్నదని ఉదహరిస్తున్నది.

Exit mobile version