ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడులు చేస్తాం : హౌతి
ఇరాన్ ఎయిర్ పోర్టుపై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు
విధాత : ఇజ్రయెల్-ఇరాన్ యుద్దంలో ఎంట్రీ ఇచ్చిన అమెరికా ఇరాన్ కు భారీ నష్టాన్ని కల్గించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ లొంగిపోవాలని..లేదంటే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలో అమెరికా సహకారంపై రెండు వారాల్లో చర్చించి నిర్ణయిస్తామన్న ట్రంప్ ఆకస్మాత్తుగా రెండు రోజులకే యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్ పై యుద్దానికి దిగిన అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. అమెరికా చర్యకు యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. 30 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను మోయగల ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లు మిస్సోరీ నుంచి బయలుదేరిన కాసేపట్లోనే ఇరాన్‌పై దాడులు జరిపాయి. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలను విజయవంతంగా ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్ ను అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని ప్రకటించారు. ఈ దాడులు అద్భుతమైన తమ సైనిక దళాల విజయమని పేర్కొన్నారు. ఇరాన్ మన ప్రజలను చంపుతోంది, మిడిల్ ఈస్ట్ లో వందలాది మంది మరణించారని..ఇరాన్ సృష్టిస్తున్న మారణహోమాన్ని కొనసాగించకూడదని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నానన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్, అమెరికా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయని..ఇరాన్ పై దాడులు చారిత్రక ఘట్టమని ట్రంప్ అభివర్ణించారు. బాంబు దాడుల తర్వాత నెతన్యాహుతో ట్రంప్ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. తమకు సహకరించిన నెతన్యాహుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నెతన్యాహూ స్పందిస్తూ తాము సమన్వయంతో అమెరికా దాడులకు సహకరించామన్నారు. ట్రంప్ నిర్ణయం చరిత్రాత్మకమన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
ఖండించిన సౌదీ అరేబియా
మరోవైపు ఇరాన్ పై అమెరికా దాడులను సౌదీ అరేబియా ఖండించింది. ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంది. రాజకీయ పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం కృషి చేయాలని..ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీ కోరింది.
ప్రతీకారం తీర్చుకుంటాం : ఇరాన్
ఇరాన్ పై అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అణుకేంద్రాలపై దాడులను ధ్రువీకరించిన ఇరాన్.నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలో దాడులు జరిగాయని పేర్కొంది. దాడులు జరిగిన మూడు ప్రాంతాల్లో రేడియేషన్ సృష్టించే పదార్థాలు లేవని ఇరాన్ మీడియా తెలిపింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇరాన్ అధికారిక మీడియా అగ్ర రాజ్యాన్ని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము పూర్తి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్‌పై దాడితో అమెరికాకు హౌతీ రెబల్స్ హెచ్చరికలు చేశారు. ఎర్రసముద్రంలో అమెరికా నౌకలను టార్గెట్ చేస్తామన్న హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఇరాన్, హౌతిల హెచ్చరికల నేపథ్యంలో అమెరికా అలర్ట్ అయ్యింది. భద్రతా సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాయి. న్యూయార్క్‌లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు..రాయబార కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచారు. కాగా టెహ్రాన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అగ్రరాజ్యంపై దాడికి యత్నిస్తే.. ఎన్నడూ చూడని విధంగా దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు.
అమెరికాకు శాశ్వత గాయం ఖాయం : ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి
తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడులను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి తీవ్రంగా ఖండించారు. ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైందని వ్యాఖ్యానించారు. అమెరికా తన నేరపూరిత సామ్రాజ్యవాద వైఖరితో తాము శాంతి యుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణుకేంద్రాలపై దాడులకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని కోరారు. యూఎన్ చార్టర్ ప్రకారం.. ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుంటూ ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. టెల్‌అవీవ్‌పై టెహ్రాన్ భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతోందని పేర్కొన్నారు.
దాడులను ముందే పసిగట్టిన ఇరాన్
అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఇరాన్ ముందే పసిగట్టినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో అణ్వస్త్ర కేంద్రంతోని కీలక పరికరాలు, యురేనియాన్ని తరలించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. శాటిలైట్ చిత్రాల్లో భారీ సంఖ్యలో కనిపించిన ట్రక్కులు. 16 కార్గో ట్రక్కులు టన్నెల్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించడం ఇందుకు బలం చేకూరుస్తుంది. ఇరాన్ తమ అన్ని అణ్వస్త్ర కేంద్రాలను శత్రుదుర్భేద్యంగా నిర్మించినట్లుగా అంచనా వేస్తున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం
అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ పై దాడి చేసిన ఇజ్రాయిల్ డిజాపుల్ ఎయిర్ పోర్టుపై దాడి చేసింది. ఇరాన్ కు చెందిన 20ఫైటర్ జెట్లను టార్గెట్ చేసి ఈ దాడులు నిర్వహించింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులకు దీటుగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడుతుంది. టెల్ అవీవ్, జెరూసలెం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఇరాన్ మిస్సైల్ లాంచర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. రెండు ఇరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్ కూల్చివేసింది.
సురక్షిత ప్రాంతంలో ఖమేనీ
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ఇరాన్. శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఖమేనీని ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉన్న ప్రదేశంలోని బంకర్ లకు తరలించారని.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్‌లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.