America
విధాత: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను తండ్రే అతి కిరాతకంగా కాల్చి చంపాడు. పిల్లలు పారిపోతుంటే వెంటాడి తీసుకొచ్చి వారిపై తూటాల వర్షం కురిపించాడు. ఈ దారుణ ఘటన అమెరికాలోని ఒహైయోలో గత గురువారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒహైయోలోని క్లెర్మాంట్ కౌంటీకి చెందిన చాడ్ డోరెమన్(32)కు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే గత గురువారం చాడ్ తన భార్యాపిల్లలపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా నలుగురు పిల్లలను తన ఇంటి వెనుకాల ఉన్న పెరట్లోకి తీసుకెళ్లాడు. పిల్లలను వరుసగా నిల్చోబెట్టి తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. పిల్లలపై కాల్పులను అడ్డుకునేందుకు యత్నించిన భార్యపై కూడా చాడ్ దాడి చేశాడు.
ఓ పిల్లాడు కాల్పుల నుంచి తప్పించుకునేందుకు యత్నించగా, ఆ బాలుడిని వెంబడించి పట్టుకున్నాడు. మళ్లీ పెరట్లోకి తీసుకొచ్చి కాల్చి చంపాడు. ఈ కాల్పుల నుంచి కూతురు తప్పించుకుని, వీధిలోకి పరుగెత్తుకొచ్చి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్ గాయంతో బాధపడుతున్న భార్య కూడా 911 నంబర్‌కు ఫోన్ చేసింది.
క్షణాల్లోనే చాడ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. చాడ్ భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మగ పిల్లలు చనిపోయారు.
పిల్లలను తానే హత్య చేసినట్లు డోరెమన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అయితే పిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చిందో మాత్రం తెలియరాలేదు. కానీ పిల్లలను చంపేందుకు గత కొన్ని నెలల నుంచి ప్లాన్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.