అమెరికా వాయుసేనలో ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు ఆ దేశానికి ఆందోళన కలిగిస్తున్నాయి. జపాన్‌లో ఓస్ప్రే హెలికాప్టర్ కూలిపోయిన ఘటన మరువక ముందే దక్షిణ కొరియా (South Korea) లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ శిక్షణా విన్యాసాలు చేస్తుండగా ఎఫ్ 16 ఫైటర్ జెట్ (F-16 Crash) కుప్పకూలిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో అందులో ఉన్న ఫైటర్ పైలట్ ప్యారాచ్యూట్ సాయంతో బయటపడ్డారని తెలుస్తోంది. రాజధాని సియోల్‌కు 200 కి.మీ. దూరంలో ఉన్న కున్సాన్ ఎయిర్ బేస్ నుంచి ఈ ఎఫ్-32 విమానం గాల్లోకి లేచింది.
అనంతరం కాసేపటికే 8:43 ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీనికి 8వ ఫైటర్ వింగ్‌కు చెందిన విమానంగా గుర్తించారు. సముద్రంలో పడిపోయిన పైలట్‌ను కొరియా మారిటైమ్ దళాలు గుర్తించి కాపాడాయి. అమెరికాకు దక్షిణ కొరియాలో ఉన్న రెండు బలమైన సైనిక బేస్‌క్యాంపుల్లో కున్సాన్ ఒకటి. ఎల్లో సముద్రంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. యూఎస్, కొరియా నేవీ బృందం సహాయక చర్యలో పాల్గొందని అమెరికా ఒక ప్రకటనలో తెలిపింది.
పైలట్ ప్రాణాలతో బయటపడినందుకు సంతోషంగా ఉందని.. ఘటనకు కారణాలు దర్యాప్తు చేస్తున్నామని యూనిట్ కమాండర్ కల్నల్ మాథ్యూ గ్యాట్కే వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే శిక్షణ కార్యక్రమంలో భాగంగా గాల్లోకి లేచిన ఎఫ్-16 జెట్ కుప్పకూలింది. ఆ ఘటనలో కూడా పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కొరియాకు సైనికపరంగా మద్దతుగా ఉండే అమెరికా ఆ దేశంలో 28,500 మంది సైనికులను మోహరించి ఉంచుతుంది.