Site icon vidhaatha

జేబులో అత్యంత విష‌పూరిత‌మైన జీవి.. త్రుటిలో చావును త‌ప్పించుకున్న యువ‌కుడు

విధాత‌: జేబులో చావును పెట్టుకుని తిరిగిన ఓ యువ‌కుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఆస్ట్రేలియా (Australia) లోని ప్ర‌ముఖ న‌గ‌రమైన పెర్త్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. 18 ఏళ్ల జాకోబ్ ఎగింట‌న్ త‌న మేన‌కోడ‌లి కోసం గ‌వ్వ‌లు ఏర‌డానికి స‌మీపంలోని స‌ముద్ర తీరానికి (Beach) వెళ్లాడు.


అందులో భాగంగానే కాసేపు తీరం మొత్తం గాలించి గ‌వ్వ‌ల‌ను ఏరుకుని జేబులో వేసుకున్నాడు. ఇంటికొచ్చి త‌న మేన‌కోడ‌లికి ఇచ్చేందుకు జేబులో చేతిని పెట్టి గ‌వ్వ‌ల్ని బ‌య‌ట‌కు తీశాడు. ఆ చేతిలోకి వ‌చ్చిన‌దాన్ని చూసి అత‌డి గుండె ఝ‌ల్లుమంది. అత‌డు తేరుకుని దాన్ని విసిరేసేలోపే క‌రిచి విషాన్ని దింపేసింది.


అది ప్ర‌పంచంలోని అత్యంత విష‌పూరిత‌మైన జీవుల్లో ఒక‌టైన బ్లూ రింగ్డ్ ఆక్టోప‌స్‌ (Blue Ringed Octopus) పెద్ద సైజు సాలీడులా ఉండే ఇది కుడితే 30 నిమిషాల్లో మృత్యువు సంభ‌వించ‌డం ఖాయం. దీని కాటు ద్వారా టెట్రోడ‌టోక్సిన్ అనే ర‌సాయానాన్ని శ‌రీరంలోకి పంపుతుంది. ఇది నాడీ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీయ‌డం ద్వారా ప్రాణాల‌ను హ‌రిస్తుంది.


ఈ విష‌యం జాకోబ్‌కు ముందే తెలిసి ఉండ‌టంతో ఆక్టోప‌స్ క‌రిచిన వెంట‌నే ఆసుప‌త్రికి ప‌రిగెత్తాడు. ఆరు గంట‌ల పాటు వైద్యులు చికిత్స చేసిన అనంత‌రం కోలుకుని ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. అదే ఈ ఆక్టోప‌స్ గురించి తెలియ‌ని వారైతే వారు చ‌నిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉండేద‌ని వైద్యులు పేర్కొన్నారు.


ఒక‌వేళ జాకోబ్ ఆ ఆక్టోప‌స్‌ను గ‌వ్వ‌ల‌తో పాటు చిన్నారికి ఇచ్చి ఉంటే ఏమి జ‌రిగేదో ఊహించ‌డానికే భ‌యంగా ఉంద‌ని జాకోబ్ కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఈ ఆక్టోప‌స్ విష‌యం చిన్న‌పిల్ల‌ల‌ను నిమిషాల్లోనే చంపేస్తుంది. సాధార‌ణంగా బ్లూ రింగ్డ్ ఆక్టోప‌స్‌లు మ‌నుషుల‌కు ఎద‌రుపడ‌వని.. ఎప్పుడూ నక్కిన‌క్కి ఉంటాయ‌ని మెరైన్ శాస్త్రవేత్త‌లు వెల్ల‌డించారు.


వేస‌వికాలంలో మాత్రం అవి మ‌న‌కు క‌న‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అందుకే ఈ కాలంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇనుప షీల్డ్ ఉండే బూట్ల‌ను వేసుకునే స‌ముద్రం వ‌ద్ద‌కు రావాల‌ని పేర్కొన్నారు. బ్లూ రింగ్డ్ ఆక్టోప‌స్ విషానికి యాంటీ వీనం లేద‌ని.. కుట్టింద‌నే అనుమానం ఉన్నా వెంట‌నే ఆసుప‌త్రికి వెళ్లిపోవాల‌ని హెచ్చ‌రించారు.

Exit mobile version